బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందనగానే సినీపరిశ్రమ ఒక్కసారిగా అవాక్కయ్యింది. 77 ఏళ్ల ఆరాధ్య నటుడు వెంటనే కోలుకోవాలని.. ప్రధాని మోడీ దగ్గర నుంచి తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన వెంటనే కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. గతంలో ఆయన కరోనా ప్రజలకు చెప్పిన జాగ్రత్తలను గుర్తు చేసుకుంటున్నారు..

 

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనావైరస్ బారిన పడ్డారనే వార్త బయటకు రాగానే దేశవ్యాప్తంగా ప్రముఖులు వెంటనే స్పందించారు. బిగ్‌బీ వెంటనే మహమ్మారి నుంచి కోలుకోవాలని, ఆయనకు సరైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారలకు సూచించినట్టు తెలిపారు ప్రధాని మోడీ. అమితాబ్‌ కచ్చితంగా కోవిడ్‌ను జయిస్తారని, ఆయనకు ఇటువంటి ఒడిదుడుకులు కొత్త కాదని తెలిపారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.

 

అమితాబ్‌, అభిషేక్‌కు కరోనావైరస్ అని తెలియగానే సినీ ఇండస్ట్రీ కూడా వెంటనే స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, సోనుసూద్, లారాదత్తా, తాప్సీ, నేహా దూపియా, దర్శకుడు గుణశేఖర్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అమిత్ జీ మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని.. మీరు త్వరగా తిరిగి రావాలని భగవంతుడిని వేడుకొంటున్నామని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

 

మీరు క్షేమంగా త్వరగా తిరిగి రావాలని కోరుకొంటున్నాం అని సోషల్ మీడియాలో పోస్ట్  చేశాడు మహేష్‌ బాబు. మీ కోసం నేను భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అని పోస్ట్ చేశాడు  హీరో నాగార్జున. 

 

కరోనా కట్టడిలో ప్రజలను జాగ్రత్త పరిచేందుకు అనేక కార్యక్రమాలు చేశారు బిగ్‌బీ. ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తూ.. ఫుల్‌ జోష్‌లో కనిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం ఎంతగానో శ్రమిస్తున్న కరోనా వారియర్స్‌ను మెచ్చుకుంటున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చశారు. ఒక్కరిగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి అంటూ సందేశమిచ్చారు అమితాబ్‌ బచ్చన్‌. 

 

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే తాను స్వయంగా రాసిన ఓ కవితను వినిపిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో  పోస్టు చేశారు. ప్రజలు చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఉసిరి, కలోంజి రసాలను సేవించాలని సూచించారు. 

 

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు సినీ ఇండస్ట్రీలు ఏకతాటిపై వచ్చేప్పుడు కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించారు. తెలుగు, తమిళ్‌, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లందరూ నటించిన ఈ షార్ట్‌ ఫిలిమ్‌లో.. కరోనాను దరి చేరనివ్వకుండా ఇంట్లోనే ఉండాలన్న ఆవశ్యకతను వివరించారు. ఈ సినిమా కథ బిగ్‌బీ కళ్లజోడు పొగొట్టుకున్న సన్నివేశం నుంచి ప్రారంభం అవుతుంది.

 

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులు ఆదుకునేందుకు.. అమితాబ్‌ బచ్చన్‌ లక్ష కుటుంబాలకు తన వంతుగా సాయం అందించారు. ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ కాన్ఫిడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందించారు. మన తెలుగు ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన CCCకి కూడా ఆయన సాయం అందించారు. అటువంటి బిగ్‌బీ ఇప్పుడు మహమ్మారి భారిన పడడం అందరినీ కలవరపెడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: