ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్.. ఇద్దరూ గాన గంధర్వులే.. అందులోనూ సమకాలికులు.. ఇలాంటి దిగ్గజాలు ఒక చోట కలిసే అవకాశాలు.. కలిసి ప్రోగ్రాములు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ.. బాలు, ఏసుదాస్ విషయంలో అలా జరగనే లేదట. తమ అనుబంధాన్ని గురించి బాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు.. ఏసుదాసుతో బాలు అనుబంధం చాలా ప్రత్యేకమైంది. తనకు ఏసుదాస్ ఒక పెద్దన్నలా, గురువుగా  ఉన్నారని ఆ ఇంటర్వ్యూలో బాలు గుర్తు చేసుకున్నారు.

బాలు ఏసుదాస్ మధ్య ఆత్మీయత పెంచిన ఓ ఘటన గురించి ఆ ఇంటర్వ్యూలో బాలు గుర్తు చేసుకున్నారు. అది బాలు మాటల్లోనే...
'ప్యారిస్‌లో ఒక కార్యక్రమం చేసేందుకు వెళ్లాం. ఎప్పుడూ ఏసుదాసు వెంట ఉండే ఆయన సతీమణి ఆ ఈవెంట్‌కు రాలేదు. ఆరోజు రాత్రి ఈవెంట్ అయిపోయాక నేను,నా భార్య హోటల్ గదికి వచ్చి కుక్కర్‌లో కాస్త రైస్ పెట్టుకుని.. కొన్ని పొడులు,పెరుగు వేసుకుని తిన్నాం. అదే సమయంలో ఏసుదాస్ గారు తిన్నారో లేదోనన్న సందేహం వచ్చింది. వెంటనే ఈవెంట్ నిర్వాహకుడికి ఫోన్ చేస్తే నీళ్లు నమిలాడు. దీంతో నేనే ఓ నాలుగు ముద్దలు అన్నం కలుపుకుని వెళ్లి ఆయన గది తలుపు తట్టాను. ఈ టైమ్‌లో ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయారు. భోజనం గురించి ఆరా తీస్తే... నిర్వాహకులు నేను చెప్పిన ఆర్డర్ మరిచిపోయినట్టున్నారు... మంచినీళ్లు తాగి పడుకున్నాను అని చెప్పారు.'

'నేను తీసుకెళ్లిన భోజనం ఆయనకు ఇచ్చాను... అప్పుడు ఆయన కళ్లల్లో నుంచి జలజలా కన్నీళ్లు... జీవితంలో ఆకలంటే ఏంటో బాగా తెలిసినవాడిని... ఎంతో కష్టపడి పైకొచ్చాను... ఎన్నో దేవాలయాలు తిరిగి పాటలు పాడాను... ఇంత చక్కటి ప్రసాదం నా జీవితంలో ఎక్కడా దొరకలేదయ్యా అన్నారు. ఆరోజు నుంచి మా అనుబంధం ఇంకా పెరిగింది... బాలు నా తమ్ముడు అని ప్రతీ సభలో ఆయన సంతోషంగా చెప్పేవారు.' అంటూ ఏసుదాస్‌ తో తన ఆత్మయ బంధాన్ని బాలు గుర్తు చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: