దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగులో కాని మరే ఇతర ఇండియన్ సినిమాలు కాని థియేటర్లలో విడుదల కాలేదు. పూర్తి అయిన సినిమాలను విడుదల చేయకుండా పెట్టుకుంటే ఆర్థిక భారం మరింత ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశ్యంతో కొందరు ఓటీటీ దారి పట్టారు.

కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. రానా నటించిన అరణ్య సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాల్సి ఉంది. థియేటర్లు మూతబడటంతో సినిమా ఇన్నాళ్లు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అరణ్య సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఆరు నెలలుగా వస్తున్న ఓటీటీ డీల్స్ కు నో చెబుతూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు ఓకే చెప్పారు.

అయితే ఆశ్చర్యంగా థియేటర్లకు కేంద్రం అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు రెడీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓటీటీలో విడుదల కోసం అయితే ఇన్నాళ్లు ఎందుకు వెయిట్ చేశారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓటీటీ లో ఎప్పుడో విడుదల అయ్యి ఉంటే నిర్మాతలకు ఆర్థికంగా చాలా కాలిసి వచ్చేది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లకు కేంద్రం ఓకే చెప్పినా కూడా పూర్తి స్థాయిలో నడిచేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఆ కారణంగానే అరణ్యను ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో వైపు రానా విరాటపర్వం సినిమా ను చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: