పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కాబోతోంది. ఈనెల 23నుంచి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం. దీంతో వకీల్ సాబ్ రిలీజ్ పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. సంక్రాంతికి కచ్చితంగా వకీల్ సాబ్ థియేటర్స్ లోకి వస్తుందన్న నమ్మకం పెరిగిపోయింది.

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూలులో తాను కూడా పాల్గొంటానని, పవన్ హామీ ఇవ్వడంతో.. ఆయనపైనే తాజా షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు యూనిట్ ప్లాన్ చేసుకుంది. వకీల్ సాబ్ సినిమాకు ఇంకా కనీసం నెలరోజులపాటు పవన్ కాల్షీట్లు అవసరం. కోర్టు సీన్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఫైటింగ్ సీన్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి కంటిన్యూగా పవన్ షూటింగ్ లకు హాజరైతే నెలరోజుల్లో సినిమా పని ఓ కొలిక్కి వస్తుంది.

థియేటర్లు ఓపెన్ అయినా ఇప్పటికిప్పుడు సినిమాలు విడుదల చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతికి పరిస్థితులు చక్కబడితే పర్వాలేదు కానీ, లేకపోతే మరికొన్ని రోజులు కొత్త సినిమాలు వాయిదా పడక తప్పదు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ ఎప్పుడు రెడీ అవుతుంది, ఎప్పుడు విడుదలవుతుందనే విషయం సస్పెన్స్ లో పడింది. సంక్రాంతికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉన్నా.. సినిమా పూర్తి చేసి పెట్టుకోవాలనేది నిర్మాత దిల్ రాజు ఆలోచన. అందుకే పవన్ కల్యాణ్ కూడా సెట్ లోకి రావడానికి రెడీ అయ్యారు. ఇది పూర్తి చేశాక మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి కాబట్టి.. పవన్ కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు ఆగాలని అనుకోలేదు. అందుకే వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి మొదలవుతుందని చెబుతున్నారు. అయితే పవన్ సినిమా షూటింగ్ లకు వస్తే కచ్చితంగా రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండాల్సిందే. లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాకే పరిమితమైన పవన్.. అటు ప్రజల్లోకి కూడా వెళ్లాల్సి వస్తుంది. అటు రాజకీయాలు, ఇటు కొత్త సినిమాలు.. పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: