హైదరాబాద్ లో ఇప్పుడు పడవలు ఏసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వందేళ్ళలో రెండో అతి పెద్ద వర్ష పాతం నమోదు కావడంతో ఇప్పటికే సగం హైదరాబాద్ మునిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ఇంకా చాలా కాలనీలు నీట మునిగే ఉన్నాయి. ఇక ఈ వరదలు, వర్షాలు మరో మూడు రోజులు దాకా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వరదల దెబ్బకు లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోన్న షూటింగులకి మళ్లీ బ్రేకులు పడ్డాయి.

ఆర్నెళ్ల లాంగ్‌ బ్రేక్‌ తీసుకుని ఇప్పుడు సెట్స్‌లో అడుగుపెట్టిన అందరు నటీనటులను మళ్లీ ఇంటికే పరిమితం చేస్తున్నాయి ఈ భారీ వర్షాలు. నిజానికి చాలా గ్యాప్ తరువాత అక్టోబర్‌ మొదటి వారం నుండే షూటింగులు కాస్త ఊపందుకున్నాయి. ఆర్.ఆర్.ఆర్ మొదలు చాలా సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళాయి. అయితే క్రమంగా ఊపందుకుంటోన్న షూటింగులకి హైదరాబాద్‌లో పడుతోన్న భారీ వర్షాలతో బ్రేకులు పడ్డాయి.

మరో పక్క భారీ వర్షాలతో చాలా ఖర్చుపెట్టి కట్టిన సెట్స్‌ కూడా దెబ్బతింటున్నాయని బాధపడుతున్నారు సినీ నిర్మాతలు. కరోనా జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగులు రీ-స్టార్ట్ చేసుకుంటే ఈ అకాల వర్షాలతో కొత్త సమస్య వచ్చిందని వాపోతున్నారు, ఈ కరోనా ప్రోటోకాల్ కోసమే రోజూ లక్షల్లో ఎక్స్ ట్రా అవుతోందని, ఇప్పుడు ఈ వరదలు వచ్చి తమని నిండా ముంచాయని వారు బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: