గత కొన్ని సంవత్సరాలుగా సినిమా మేకర్స్ పాలిట విలన్ లా ప్రవర్తించిన సంస్థ అలాగే పైరసీ అనగానే అందరికీ ముందుగా టక్కున గుర్తొచ్చే సంస్థ "తమిళ్ రాకర్స్" వెబ్‌సైట్. థియేటర్లలో సినిమా విడుదలైన మొదటిరోజు మొదటి షో పడగానే పైరసీ కాపీ ఈ వెబ్‌సైట్లోనే మొదటగా దర్శనమిచ్చేది. గత కొన్నేళ్లుగా తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ భాషల్లోనే కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో విడుదలైన సినిమాల పైరేటెడ్ వెర్షన్స్ అన్నింటిని ఈ తమిళ్ రాకర్స్ తమ సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చేది. ఈవిధంగా 'పైరసీ కింగ్' గా పేరు గడించింది ఈ వెబ్ సైట్. దీనివల్ల నిర్మాతలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ వెబ్‌సైట్‌ని బ్యాన్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘తమిళ్ రాకర్స్’ వెబ్‌సైట్ పూర్తిగా తొలగించినట్లు తెలుస్తోంది. డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం ప్రకారం తాజాగా అమెజాన్ ఇంటర్నేషనల్ సంస్థ తమిళ్ రాకర్స్‌కు వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు చేసింది. వాటిని పరిశీలించిన ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ICANN) రిజిస్ట్రీ ద్వారా ఆ సైట్‌ను తొలగించారట. తమిళ రాకర్స్ వెబ్‌సైట్స్‌ షట్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ వార్తతో తమిళ హీరోల ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం తమిళ్ రాకర్స్ త్వరలోనే కొత్త డొమైన్‌తో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: