హైదరాబాద్ వరద బాధితులకు పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. పవన్ తో పాటు చాలామంది సినీ నటులు కూడా వరద బాధితులకు బాసటగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తామని ముందుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. తెలంగాణతోపాటు ఏపీలో కూడా వరదలు వచ్చాయి కదా, వరద బాధితులు ఏపీలో లేరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం తెలంగాణకు మాత్రమే వరద సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్ ఏపీలోని రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం రాజకీయ పార్టీ అధినేత హోదాలో కూడా ఏపీలో పవన్ కల్యాణ్ పర్యటించలేదని గుర్తు చేస్తున్నారు.

మిగతా సినీ నటులపై కూడా ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నా పవన్ కల్యాణ్ మాత్రం కాస్త ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ సినీ నటుడిగా విరాళం ప్రకటించారా లేక రాజకీయ పార్టీ అధినేతగా ఆర్థిక సాయం ప్రకటించారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీకి ఓట్లు లేకపోయినా, ఏపీ ప్రజలు జనసేనకు ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా పవన్ ఏపీకి సాయం ప్రకటించలేదని ఎద్దేవా చేస్తున్నారు.

ఒకరకంగా హైదరాబాద్ కు వరద సాయం ప్రకటించిన సినీ నటులంతా ఇవే తరహా విమర్శలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వరదలకు హడావిడిగా సాయం ప్రకటించి నటీనటులెవరూ కనీసం ఏపీ గురించి వాకబు చేయలేదని, ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సినీ నటులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానమే అయినా.. ఏపీ విషయం పట్టించుకోకపోవడం బాధాకరం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా తొలిగా ఏపీకి కూడా విరాళం ప్రకటిస్తే.. ఆ తర్వాత మిగతా వారు కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తమ్మీద విరాళం ప్రకటించి మరీ సినీ నటులు ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి రావడం మాత్రం విచిత్రమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: