హీరో రాజశేఖర్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తనకు మరియు కుటుంబానికి కరోనా సోకినట్లు తెలియజేశారు. భార్య జీవితా మరియు కూతుళ్లు శివాని, శివాత్మికలు కూడా కరోనా బారిన పడ్డట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్న రాజశేఖర్...హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కాసేపటి క్రితం చేసిన ట్వీట్ ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. " ప్రియమైన అందరికి... కోవిడ్‌తో నాన్న పోరాటం చాలా కష్టంగా వుంది, అయినప్పటికీ ఆయన దానితో గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనల ప్రేమ మరియు దీవెనలు మమ్మల్ని రక్షిస్తున్నాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను! మీ ప్రేమతో, ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు" అని పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్‌పై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. రాజశేఖర్‌ త్వరగా కోలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. "ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహా నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు" అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇక రాజశేఖర్‌ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రి సిబ్బంది హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌లో ఉన్నప్పటికీ వైద్యానికి హీరో రాజశేఖర్‌ స్పందిస్తున్నారని తెలిపారు. త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: