గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేశాయి. చెరువులు, నాలాలు పొంగి పొర్లడంతో మహానగరం మొత్తం నీట మునిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా చోట్ల జన జీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి, నగరాన్ని మరలా పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా టాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమ నిలిచింది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా చాలా మంది తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు.

టాలీవుడ్‌ నుంచి అత్యధికంగా నందమూరి బాలకృష్ణ ఒక కోటి 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 50 లక్షలు, అక్కినేని నాగార్జున 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, మాస్ మహరాజ్ రవితేజ రూ.10 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్-నిర్మాత ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా రూ. 10 లక్షలు, డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ.5 లక్షలు, కామెడీ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు ఇచ్చారు.

వీళ్లతో పాటు ఇప్పుడు హీరో రామ్ సైతం రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని అందజేస్తున్నట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఈరోజు ఐటీ మంత్రి కేటీఆర్‌ ని మర్యాద పూర్వకంగా కలిసి హీరో రామ్.. రూ.25 లక్షల చెక్కును ఆయనకు అందజేశారు. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫోటోతో పాటు విషయాన్ని ట్వీట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: