పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరో కమ్ పొలిటీషియన్. ఆయన ఇపుడు రీ ఎంట్రీ ఇచ్చి వరసగా సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయ రంగంలోనూ దూకుడుగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం అయ్యాయి. సినిమా వాళ్ళ గురించి తప్పుడు అభిప్రాయం జన సామాన్యంలో ఉందని పవన్ అంటున్నారు. సినిమా వాళ్ళకు పేరు ఎక్కువగా వస్తుంది కానీ డబ్బు వారి వద్ద పెద్దగా ఉండదంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు.

సినిమా వాళ్ల దగ్గర లిమిటెడ్ గానే డబ్బు ఉంటుందని, ఏడాదికి తీసే వందల సినిమాల బడ్జెట్ అంతా కలిపినా రెండు వేల కోట్లకు మించదని పవన్ అంటున్నారు. అదే సమయంలో బయట రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, మీడియా హౌజ్ పెద్దలు వీళ్ళ దగ్గర తమ కన్నా ఎక్కువగానే డబ్బు ఉంటుందని కూడా పవన్ చెప్పుకొచ్చారు.

ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే అందరూ సినిమా వాళ్ళు విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూంటారని, అసలు తమ వద్ద ఎంత ఉంటుందని ఇవ్వడానికి అని పవన్ ప్రశ్నించారు. సినిమా తీయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని కూడా ఆయన అన్నారు. సినిమా హిట్ అయినా చేతికి వచ్చే సొమ్ము చాలా తక్కువ అని కూడా ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన రామ్ చరణ్ ఆరెంజి మూవీ గురించి కూడా పవన్ చెప్పారు. ఆ సినిమాను తన అన్న నాగబాబు తీశారని, ఆ మూవీ పరాజయం పాలు కావడంతో తన అన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సివచ్చిందని, ఆ సినిమా కోసం తాను కూడా కొన్ని చోట్ల అప్పులు చేయాల్సివచ్చిందని పవన్ వివరించారు. మొత్తానికి ఆరెంజి  సినిమా అన్నది మెగా ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు అనుభవం అని పవన్ మాటల ద్వారా అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: