నాగార్జున - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ గురించి మనం చెప్పుకోవలసిన పనిలేదు. ముఖ్యంగా వీరిద్దరి కలయికలో వచ్చిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు జీవిత కథతో తెరకెక్కిన 'అన్నమయ్య' సినిమాను తెలుగు సినిమా లోకం అంత త్వరగా మర్చిపోదు. ఇందులో కింగ్ నాగార్జున నటన న భూతో న భవిష్యతి.  సినిమా ఎండింగ్ సీన్ 'అంతర్యామి' ఎపిసోడ్ చుస్తే ఇప్పటికీ కళ్ళు చెమర్చక మానవు. ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘అగ్నిపుత్రుడు’ అన్న సంగతి తెలిసినదే.

అలాగే వీరి కాంబినేషన్‌లో వచ్చిన 2వ సినిమా ‘ఆఖరి పోరాటం’. శ్రీదేవి, సుహాసిని హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక 3వ సినిమా ‘జానకి రాముడు’ మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసినదే. అయితే ఇలాంటి సినిమాలు వీరి కలయికలో ఎన్ని వచ్చినా కూడా 'అన్నమయ్య' స్థానమే వేరు. నాగార్జున కెరీర్‌లోనే అన్నమయ్య చిత్రం చాలా కీలకం. టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక సంచలన చిత్రంగా ఇది నిలిచిపోయింది.

ఇకపోతే దీని తరువాత చాలా సంవత్సరాల విరామం తరువాత మరో భక్తిరస చిత్రం తెరకెక్కింది. దానిపేరు ‘శ్రీరామదాసు’. కాగా ఇది వీరి కలయికలో వచ్చినా 7వ చిత్రం. అన్నమయ్య అంత కాకపోయినా ఇది కూడా బాగానే ఆడింది. ఇక తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన 8వ చిత్రం ‘శిరిడి సాయి’. ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఒకింత నిరుత్సాహపరిచింది. అలాగే మరలా వీరి కలయికలో 9వ సినిమాగా తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ’ సినిమా బాక్సాపీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.

కాగా.. వీరిద్దరూ కలిసి రౌండ్ ఫిగర్ పూర్తి చేద్దామని 10వ చిత్రానికి సన్నద్ధం అవుతున్నారట. ఇక పొతే ఇది కూడా ఓ భక్తిరస చిత్రమని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. గత చిత్రాల్లా కాకుండా దీన్ని అన్నమయ్య సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా  తీర్చిదిద్దాలని భక్తిరస చిత్రాల దర్శకుడు K రాఘవేంద్రరావు కంకణం కట్టుకున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: