డ్రగ్స్‌ కేసులో ఊచలు లెక్కబెడుతున్న కన్నడ హీరోయిన్లకు ఇప్పట్లో బెయిల్‌ రాదా? ఇంకొన్నాళ్ల పాటు కటకటాల వెనుక ఉండాల్సిందేనా? అసలు కోర్టులు ఎందుకు వీరి బెయిల్‌ పిటిషన్లను వాయిదా వేస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కన్నడ హీరోయిన్స్‌ రాగిణి దివేది, సంజనా పరిస్థితి దయనీయంగా మారింది. బెయిల్‌ కోసం ఎదురుచూస్తూ సెంట్రల్ జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లేదు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ కు రాగిణి వెళ్లి 50 రోజులు, సంజనా వెళ్లి 45 రోజులు దాటింది. వీరి బెయిల్ పిటిషన్ల విచారణను కోర్టు వాయిదా వేసింది. బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరాలు రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

మరోవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులోని సీసీహెచ్ 36వ కోర్టుకు.. సంజనా, రాగినికి బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని బెదిరిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. ఇప్పుడు ఇదే టైమ్ లో నటి సంజనా, రాగిణిలు తమకు  బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఈ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి నటి సంజనా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇలాంటి సమయంలో  బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు ఆటంకాలు ఏర్పడుతాయని పోలీసుల తరుపు లాయర్లు వాదించడంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

సంజనా, రాగిణికి ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వారిది. పక్కా ఆధారాలు ఉండటంతో విచారణకు ఆటంకం ఏర్పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే న్యాయస్థానం వీరి బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అటు బెయిల్ రాకపోవడంతో ఇద్దరి హీరోయన్లు మరోసారి నిరాశకు గురయ్యారు.

మొత్తం మీద కోర్టుకు, పోలీసు అధికారులకు వార్నింగ్ ఇస్తూ లేఖలు రాయడంతో నటి సంజనాపై  ఆమె అభిమానులే విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: