దసరా అంటే సరదా అని కూడా అర్ధం చెప్పుకోవాలి. ఇది కార్మికుల పండుగ. మన భారతీయ సంప్రదాయంలో ప్రతీ వృత్తికి కూడా వేడుక ఉంది. శ్రమను మరచిపోయే విధంగా చేసే పండుగలు చాలానే  ఉన్నాయి.  ఇక దసరా వచ్చిందంటే ఆ సందడే వేరు. ఆధునిక యుగంలో సినిమాలు వచ్చాయి. దానికంటే ముందు కళా ప్రదర్శనలతో దసరా వేళ జనాలను ఆకట్టుకునేవారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ కి దసరా సెంటిమెంట్ చాలా ఎక్కువ. టాలీవుడ్ కి అధ్బుతమైన సీజన్లు మూడు అనుకుంటే అందులో దసరా ఒకటి. అంతే కాదు. విజయాలను కచ్చితంగా అందించే పండుగగా చెబుతారు. పది రోజుల పాటు సెలవులు ఉండడంతో ఎవరేజి  సినిమా అయినా దసరా నాడు  హిట్ అయ్యే సీన్ ఉంటుంది.

ఎన్టీయార్, ఎయన్నార్ కాలం నుంచి కూడా దసరా పండుగను టార్గెట్ చేస్తూ సినిమాలు రిలీజ్ చేసేవారు, సూపర్ డూపర్ హిట్లు కొట్టేవారు. ఇక క్రిష్ణ, శోభన్ బాబు తరంలోనూ ఆ హిట్ల దూకుడు కొనసాగింది. చిరంజీవి, బాలయ్య ఎంట్రీ తరువాత దసరా బ్లాక్ బస్టర్లతో మారుమోగింది. అలాగే నాగార్జున, వెంకటేష్ కూడా విలువైన హిట్లు ఎన్నో దసరా వేళ అందుకున్నారు.

యంగర్ జనరేషన్ విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీయార్ కి దసరా మంచి హిట్లు ఇచ్చింది. బృందావనం ఆయన 2010లో సూపర్ హిట్ కొట్టిన మూవీ, రీసెంట్ యియర్స్ లోకి వస్తే 2017లో దసరాకు వచ్చిన లవకుశ ఎన్టీయార్ కెరీర్ ని మలుపు తిప్పింది. అలాగే 2018లో అరవింద సమేత మూవీ కూడా వచ్చింది. మరో వైపు రాం చరణ్ కి గోవిందుడు అందరి వాడే లాంటి మరపురాని హిట్ ని ఇచ్చింది ఈ దసరావే. మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా అందరి హీరోలు దసరా వేళ హిట్లతో తీపి గుర్తులు మిగుల్చుకున్నవారే.

అయితే 2020 దసరా మాత్రం అందరికీ షాక్ ఇచ్చేసింది. ఆ మాటకు వస్తే టాలీవుడ్ కే భారీ షాక్ గా మారింది. కరోనా వైరస్ నేపధ్యంలో షూటింగులు ఓ వైపు లేవు. దాంతో పాటు సినిమా థియేటర్లు తెరచినా జనం రాని సీన్ కనిపిస్తోంది. దాంతో సినిమా సందడి లేకుండా బోసిపోయింది. 2021కి అయినా దసరా వేళ కళ కట్టించాలని, సినిమా పరిశ్రమ పచ్చగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. సామాన్యుడికి ఎన్ని వినోదాలు అందుబాటులోకి వచ్చినా సినిమా లేని లోటుని ఏవీ తీర్చలేవు. ఆ విధంగా చూసుకుంటే వచ్చే ఏడాది మీదనే జనాలు  ఆశలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: