అతను డైలాగ్ చెబితే ఫ్యాన్స్ ఒకటే చప్పట్లు, ఫైట్ చేస్తే ధియేటర్లు దద్దరిల్లేటువంటి గోలలు, కామెడీ చేస్తే ఆనందంతో వేసే ఈలలు, వీటన్నింటినీ మించి అతను తెరపై కనిపించినా, బయట కనిపించినా పూనకాలతో ఊగిపోయే అభిమాన ధనం ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలామంది చాలా సందర్భాల్లో చెబుతుంటారు పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారని. దాదాపు రెండున్నర సంవత్సరాలు విరామం ఇచ్చి ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'వకీల్‌ సాబ్‌' సినిమా సెట్స్‌పై ఉండగా.. త్వరలోనే క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ప్యారలల్‌గా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒకటి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నట్లు ఆయన అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగానే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతూ దసరా కానుకగా ఆయన మరో సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా వివరాలు ప్రకటిస్తూ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్. 12గా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పవన్ ఇమేజ్ రెట్టింపు చేసేలా.. ''కింగ్ ఆఫ్‌ ఆట్యిట్యూడ్‌... తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హై ఓల్టేజ్‌ రోల్‌తో మీ ముందుకు రాబోతున్నారు'' అని ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి థమన్ బాణీలు కట్టనుండగా, ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌'కు ఇది రీమేక్‌గా రూపొందనుందని టాక్‌. చిత్రానికి సంబంధించి ఇతర వివరాలతో పాటు పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని అతిత్వరలో వెల్లడించనుందట చిత్రయూనిట్. దీంతో పవన్ అభిమానులు ఈ ఊహించని దసరా స్పెషల్ గిఫ్ట్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: