అవును నిజమే, ఒక పేద రైతు ఒంటెను రాజస్థాన్ లో దిగబెట్టేందుకు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అంత అవసరం ఏమొచ్చింది? ఆఫ్ట్రాల్ ఒక ఒంటె కోసం అన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడమా? అతనికేమైనా పిచ్చా? అని సందేహాలు కలుగుతున్నాయి కదూ. అయితే మీరు డియర్ సారా మూవీ చూడాల్సిందే. డియర్ సారా మూవీ 2019 లో రిలీజైన తమిళ మూవీ బక్రీద్ సినిమాకి తెలుగు వెర్షన్. ఈ సినిమాలోనే హీరో ఒక ఒంటె కోసం రిస్క్ చేసి మరీ రాజస్తాన్ వెళ్తాడు. స్టోరీ ఏంటన్నది చెప్పాలంటే, ఒక పేద రైతు పూట గడవడమే కష్టంగా ఉంటుంది. అతనికి భార్య, ఒక చిన్న పాప ఉంటారు. అతనికి ఒక అన్నయ్య కూడా ఉంటాడు. అన్నయ్యకి తమ్ముడు అంటే ఇష్టం ఉండదు. ఇక మన హీరో రైతు విషయానికి వస్తే, ఏడేళ్ళ పాటు తాకట్టులో ఉన్న పొలాన్ని కష్టపడి పని చేసి విడిపిస్తాడు. అయితే సొంతంగా వ్యవసాయం చేయడం కోసం ఎద్దులని కొనేందుకు బ్యాంకులో లోన్ కోసం వెళ్తాడు. అయితే బ్యాంకు వాళ్ళు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళకే లోన్ ఇస్తారు కానీ, రైతులకి ఇవ్వరు కదా. సరిగ్గా ఈ సినిమాలో కూడా బ్యాంక్ వాడు ఇవ్వనని మొహం మీద చెప్పేస్తాడు. 


రైతు ఏం చేయాలో తెలియక బయట వాళ్ళ దగ్గర అప్పు చేయాలని అనుకుంటారు. స్నేహితుడి ద్వారా ఒక ముస్లిం పెద్ద దగ్గరకు వెళ్ళి లక్ష రూపాయలు అడుగుతారు. ఆ పెద్దాయన ఆ రైతు బాధను అర్ధం చేసుకుని లక్ష రూపాయలు అప్పుగా ఇస్తారు. ఆ డబ్బుతో ఆ రైతు ఎద్దులను కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ముస్లిం పెద్ద ఇంటికి ఒక లారీలో ఒక పెద్ద ఒంటె, దాని పిల్ల వస్తాయి. పిల్ల ఒంటెను తీసుకొచ్చినందుకు ఆ ముస్లిం పెద్ద తన వాళ్ళని తిడతాడు. ఆ సమయంలో ఆ ఒంటెను ఆ రైతు తీసుకెళ్తానని అంటాడు. రైతు ఆ ఒంటెను ఇంటికి తీసుకెళ్లి కూతురికి చూపిస్తాడు. సారా అని పేరు పెడతారు. ఉనట్టుండి దానికి జబ్బు చేస్తుంది. డాక్టర్ ని పిలిస్తే దానికి ఇక్కడ వాతావరణం పడలేదు. ఇక్కడ తిండి వేరు, రాజస్తాన్ లో ఒంటెలు తినే తిండి వేరు అని చెప్తాడు. ఈ ఒంటెను రాజస్తాన్ లో ఎడారి ప్రాంతంలో వదిలేస్తే బతుకుతుంది, లేదంటే చనిపోతుంది అని అంటాడు. ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది.


మామూలుగా ఒంటెను తెచ్చుకోవడానికే ఎవరూ సాహసం చేయరు. ఒకవేళ చేసినా దానికి ఏమైనా అయితే పెద్ద పట్టించుకోరు. ఇక రాజస్తాన్ తీసుకెళ్ళడం అంటే అస్సలు ఆ ఒంటెకు అంత సీన్ లేదనుకుంటారు. అది కూడా రిస్క్ చేసి మరీ తీసుకెళ్ళడం అంటే ఎవరూ సాహసం చేయరు. ఎందుకంటే జంతువులను ఇతర ప్రాంతాలకి తరలిస్తే పోలీసు కేసు అవుతుంది. ఇవేమీ తెలియకుండా ఆ రైతు ఆ ఒంటెను లారీలో రాజస్తాన్ తీసుకెళ్ళేందుకు లారీ వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు బకరా దొరికాడురా అని ఆ రైతును మోసం చేసి, సారాను దారి మధ్యలో అమ్మేయాలని అనుకుంటారు. అలా లారీలో ఒంటెను ఎక్కించి తీసుకెళ్తుండగా కొంత దూరం వెళ్ళాక పోలీసులు రైతును, లారీ డ్రైవర్ ను, క్లీనర్ ను పట్టుకుంటారు. ఒంటెను అక్రమంగా తరలిస్తున్నారని వాళ్ళని నైట్ అంతా జైల్లో ఉంచుతారు. ఈలోపు సారా తాడు తెంచుకుని పారిపోతుంది. తెల్లారాక పోలీసులు వాళ్ళని వదిలేస్తారు. 


లారీ డ్రైవర్, క్లీనర్ సారాను వదిలేసి మీ ఊరు వెళ్లిపో అని రైతుతో అంటారు. కానీ రైతు సారా మీద ఉన్న ప్రేమతో, తానే దగ్గరుండి దాన్ని రాజస్తాన్ లో మిగతా ఒంటెల దగ్గర దింపి వస్తానని అంటాడు. లారీడ్రైవర్, క్లీనర్ రైతుకు నచ్చజెప్పి, స్వయంగా టికెట్ తీసి రైతును బస్ ఎక్కిస్తారు. మార్గం మధ్యలో ఆ రైతుకు సారా కనిపిస్తుంది. అంతే బస్ ఆపమని చెప్పి దిగేస్తాడు. కానీ అక్కడ సారా కనిపించదు. అతని భ్రమ అని రియలైజ్ అవుతాడు. ఎటు చూసినా సారానే కనిపిస్తుంది. ప్రేమలో పడితే ప్రేయసి ఎలా అయితే కళ్ల ముందు కనబడుతుందో అలా సారా ఆ రైతు కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఒక చోట ర్తైటు దిగులుగా కూర్చుని ఉంటాడు. భార్య కాల్ చేస్తే, మాట్లాడతాడు. తన కూతురు సారా ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లాను, వచ్చేస్తాము అని అంటాడు రైతు. కూతురికి కూడా సారా అంటే చాలా ఇష్టం. అయితే ఎద్దులు తాడు తెంపుకుని వెళ్లిపోతుంటే రైతు భార్య మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే రైతుకు ఎద్దులానే సారా కూడా తాడు తెంపేసుకుని ఉంటుంది అని ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. 


అప్పటికే చాలా దూరం వచ్చేసిన ఆ రైతు నడుచుకుంటూనే వేరే ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అయితే సారా స్టేషన్ లో కనిపించదు. బయట నుంచి నడుచుకుంటూ వస్తుంది. అది చూసిన ఆ రైతు, దాన్ని కౌగిలించుకుని రాజస్తాన్ వెళ్ళేందుకు సిద్దమవుతాడు. మొత్తానికి రాజస్తాన్ లో ఎడారి ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఓ పెద్ద మనిషికి సారాను పెంచుకోండి అని ఉచితంగా ఇచ్చేస్తాడు. అమ్మేందుకు కాదా, మరెందుకు తీసుకొచ్చావ్ అని వాళ్ళు అడిగితే, జరిగిన కథ చెప్తాడు. దీన్ని మా ఊళ్ళో ఓ ముస్లిం పెద్ద దగ్గర తీసుకున్నానని, దీనికి అక్కడ వాతావరణం పడక ఇక్కడ వదిలిపెట్టేందుకు వచ్చానని అంటాడు. దానికి వాళ్ళు ఎలా వచ్చావ్ అంటే నడుచుకుంటూ వచ్చానని చెబుతాడు. చెన్నై నుంచి రాజస్తాన్ కు 25 వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చావా అని అంటారు. అలా మంచివాళ్ళుగా నటించిన ఆ స్థానిక పెద్దలు, రైతుకు అన్నం పెడతారు.  రైతు అన్నం తిని, చేతులు కడుక్కుంటుండగా, ఒంటెలను కొనేందుకు కొంతమంది వస్తారు. 


అది చూసి రైతు ఇక్కడ సారా ఉంటే సేఫ్ కాదని తెలుసుకుంటాడు. సారా తన ఇంటి దగ్గర ఉంటేనే సేఫ్ అనుకుని రైతు, సారాను తీసుకుని వెళ్ళిపోతాడు. దారిలో ఆ ఒంటెను చంపి దాని మాంసం తినాలని కొంతమంది దాడి చేయడానికి రావడం, ఆ ఒంటె ఆర్మీ వాళ్ళకి సాయం చేయడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్నో తిప్పలు పడి రైతు సారాతో ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆర్మీ ఆఫీసర్లు ఒంటె తమని కాపాడిందని thanks చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేస్తారు. అది కాస్తా వైరల్ అవుతుంది. ప్రభుత్వం దాన్ని గుర్తించి సారా యజమాని అయిన రైతుకు లక్ష రూపాయలు ఇస్తారు. అయితే సినిమా మధ్యలో ఒక సీన్ లో తమ్ముడి పొలం ఎండిపోతుంటే అన్నయ్య మోటార్ ఆన్ చేసి పొలానికి నీళ్ళు పడతాడు. అలా అన్నయ్య, తమ్ముడికి దగ్గరవుతాడు. 


సారా వచ్చి ఏం చేసింది అంటే, ఆర్మీ ఆఫీసర్లను ఆపదలో ఉంటే రక్షించింది. ముస్లిం పెద్ద దగ్గర తీసుకున్న లక్ష రూపాయల రైతు అప్పును తీర్చింది. రైతుకు దూరమైన తన అన్నయ్యను దగ్గర చేసింది. అలా జంతువులు ఎప్పుడూ మనుషులకి మేలు చేస్తాయే తప్ప హాని చేయవు అని చక్కని సందేశాన్ని ఇచ్చారు డైరెక్టర్ జగదీశన్ సుబ్బు. సినిమా అయిపోయాక లాస్ట్ లో ఒక పాప స్విమ్మింగ్ పూల్ లో పడిపోబోతుంటే పెంపుడు కుక్క కాపాడడం, అలానే ఒక ఏనుగు రివర్ లో కొట్టుకుపోతున్న ఒకతన్ని రక్షించడం, ఒక షాప్ లో దొంగతనానికి వచ్చిన దొంగలపై కుక్క వీరోచితకంగా పోరాడడం వంటివి విజువల్స్ పెట్టి జంతువులు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో చూపించారు దర్శకుడు. 


ఇక రైతు పాత్రలో విక్రాంత్ చాలా అద్భుతమైన నటన కనబరిచారు. కేరాఫ్ సూర్య సినిమాలో సందీప్ కిషన్ కి ఫ్రెండ్ గా నటించిన అతనే ఈ విక్రాంత్. సారా పాత్రలో ఆ ఒంటెను చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది. అంత బాగా నటించింది ఆ ఒంటె. డి.ఇమ్మన్ సంగీతం కూడా ఒక చక్కని అనుభూతిని కలిగిస్తుంది. ఒక మంచి సినిమా చూశామన్నా సంతృప్తి కలుగుతుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఈ “డియర్ సారా” మూవీ. యూట్యూబ్ లో చూడచ్చు. ఇక విక్రాంత్ నటించిన మరో అద్భుతమైన సినిమా, “షూట్ ఎట్ సైట్ ఉత్తర్వు”. ఈ సినిమా కూడా సూపర్ ఉంటుంది. అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుంది. పోలీసులు ఇలా ఆలోచిస్తే టెర్రరిస్తులని పట్టుకోవచ్చు అని దర్శకుడు రామ్ ప్రకాష్ రాయప్ప అద్భుతంగా చూపించారు. ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో రావు, రీమేక్ లు చేయరు, కనీసం డబ్ చేసిన సినిమాలు అయినా థియేటర్స్ లో ఆడవు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే దొరుకుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: