‘దసరా వచ్చిందమ్మో.. సరదా తెచ్చిందయ్యో..’ అని బాలకృష్ణ సినిమా లారీ డ్రైవర్ లో ఓ పాట ఉంది. విజయదశమి సందర్భం అందరికీ శుభమే. సినీ పరిశ్రమ కూడా ఈ సంబరమే చేసుకుంది. కొత్త ప్రాజెక్టులెన్నో ప్రకటించారు మేకర్స్. వీరిలో ‘గుడ్ సినిమా గ్రూప్’ కూడా ఉంది. ఈరోజుల్లో, ప్రేమకథా చిత్రం, విల్లా, పిజ్జా2.. వంటి సినిమాలను అందించింది ఈ సంస్థ. ఇప్పుడు వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. విజయదశమి పండగ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. వీటిలో.. గోల్డ్ మ్యాన్, నలుగురితో నారాయణ, గోదారి కథలు, క్రేజీ అంకుల్స్.. సినిమాలు ఉన్నాయి.
‘గోల్డ్ మ్యాన్’ సినిమాను బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత, దర్శకత్వం ‘గుడ్ ఫ్రెండ్స్’ స్వీయ నిర్మాణంలో జరుగుతోంది. ఈ సినిమా పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు లుక్ రివీల్ చేసింది టీమ్. ‘నలుగురితో నారాయణ’ అనే మరో సినిమాను ప్రకటించింది. చవన్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2021 సంక్రాంతి పండగకి రిలీజ్ అని ప్రకటించింది. ‘గోదారి కథలు’ అనే మరో సినిమాను కూడా నిర్మిస్తోంది. గుడ్ ఫ్రెండ్స్ నిర్మాతలుగా.. మురళీకృష్ణ ముడిదని దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సంగీతం కల్యాణీ మాలిక్ అందిస్తున్నారు.

‘క్రేజీ అంకుల్స్’ అనే మరో సినిమాను కూడా ప్రకటించింది. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్, బిగ్ బాస్3 రన్నరప్ శ్రీముఖి, సీనియర్ నటుడు రాజా రవీంద్ర, ప్రముఖ గాయకుడు మనో.. తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం, దర్శకత్వం కూడా ‘గుడ్ ఫ్రెండ్స్’ స్వయంగా తీసుకుంది. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. నలుగురితో నారాయణ తప్ప మిగిలిన సినిమాలకు కిరణ్ కె తలశిల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: