ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి మరో బాంపు పేల్చారు దర్శకుడు రాజమౌళి. అయితే ఈ సారి ఆయన హీరోలిద్దర్నీ టార్గెట్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా.. కొత్త సినిమాలు ఎప్పుడు మొదలు పెడదామా అని ఆలోచిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ కి ఒకరకంగా షాకిచ్చారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే వీరెవరూ కొత్త సినిమాల జోలికి వెళ్లకూడదని తేల్చి చెప్పేశారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన తర్వాత మరో 4 నెలలపాటు గెటప్స్ మార్చకూడదని కండిషన్ పెట్టారు.
అసలు విషయం ఏంటంటే..?
భారీ బడ్జెట్ తో వస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పై రాజమౌళి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. బాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కూడా. అందుకే సినిమాపై అంత పట్టింపుతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త గెటప్ లలోకి వచ్చారు. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ గెటప్స్ మార్చకూడదని హీరోలిద్దరికీ కండిషన్ పెట్టారట రాజమౌళి. సినిమా రిలీజ్ వరకు ఈ గెటప్స్ అలాగే వుంచాలని, హీరోలిద్దరినీ తాను ప్రమోషనల్ టూర్‌కి తీసుకెళతానని రాజమౌళి చెప్పాడట.

ఒకవేళ రీషూట్స్ అవసరమయినా హీరోలు గెటప్స్ ఛేంజ్ చేస్తే అది వీలుపడదు. అదే జరిగితే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే వరకు హీరోలు తమ గెటప్స్ మార్చుకునే వీలుండదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత కనీసం నాలుగైదు నెలల పాటయినా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే ఆ నాలుగు నెలలు హీరోలిద్దరూ మరో కొత్త సినిమా జోలికి వెళ్లడానికి వీళ్లేదనమాట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఆచార్య లో తన పోర్షన్ కంప్లీట్ చేయాల్సి ఉంది. దీనిపై కూడా సందిగ్ధం నెలకొంది. మొత్తమ్మీద కొత్త సినిమాలకోసం ఎదురు చూస్తున్న హీరోలిద్దరినీ అలా లాక్ చేశారు రాజమౌళి. జక్కన్న నిర్ణయంతో తారక్, చరణ్ ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: