కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి కష్టాలు పడుతున్న  సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి తమిళ చిత్రసీమలోని అగ్రనటీనటులు, సాంకేతిక నిపుణులు ఏకమవబోతున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తర్వాతి ప్రాజెక్టు 'నవరస'ను ప్రకటించారు. ఆయన, జయేంద్ర పంచపకేశన్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొమ్మిది కథలతో.. తొమ్మిది మంది దర్శకులు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

 ఈ సినిమాలో హాస్యం, రౌద్రం, శాంతం, కరుణ, భయానకం.. ఇలా నవరసాల్లోని ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తూ తొమ్మిది కథలతో ఈ అంథాలజీ సినిమా తెరకెక్కబోతున్నది. ఇందులో సూర్య, విజయ్‌సేతుపతి, సిద్దార్థ్‌, ప్రకాష్‌రాజ్‌, రేవతి, నిత్యామీనన్‌, ఐశ్వర్యరాజేష్‌తో పాటు తమిళ చిత్రసీమకు చెందిన అగ్రనటీనటులు కనిపించబోతున్నారు.కేవీ ఆనంద్, గౌతమ్ మేనన్‌, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, పొన్ రామ్, హలిత షలీమ్, అరవింద్ స్వామి, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఎటువంటి పారితోషికం తీసుకోకుండా వీరు ఈ సినిమా కోసం పనిచేయబోతుండటం విశేషం.

అయితే ఈ సినిమా కోసం గాయకుడు కార్తిక్‌ కూడా పనిచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో 'మీటూ' ఆరోపణలు ఉన్న అతడ్ని మణిరత్నం తన సినిమాకు తీసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు, గాయని చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు పనిలేక ఇబ్బందులు పడుతుంటే.. వేధించిన వారికి మాత్రం పని కల్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది ఆమె. పలువురు నెటిజన్లు చేసిన కామెంట్స్ ని ఉద్దేశిస్తూ చిన్మయి స్పందించారు.

ఇక వేధింపుల ఆరోపణలు ఉన్న వ్యక్తికి అండగా ఉండి, అతడికి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. వైరముత్తుకు ఎంత మద్దతు ఉందో కార్తీక్‌కు కూడా అంతే అండ ఉందని పేర్కొన్నారు. వైరముత్తు, రాధారవి తనను నిషేధించారని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. చాలా మంది గాయకులు, మహిళలు మౌనంగా వైరముత్తుతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేయడంతో.. మణిరత్నం హ్యాష్ ‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: