రజనీకాంత్ అనారోగ్యంపై మరోసారి తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండాలని  వైద్యులు సూచించినట్టు ఓ లేఖ  సోషల్ మీడియాలో వైరల్ కావడం  సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన తలైవా... లేఖకు తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ లేఖలో తన ఆరోగ్యంపై ప్రస్తావించిన విషయాలు నిజమేనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  రజనీకాంత్ రాసినట్టు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూపర్ స్టార్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని గతంలో ఇందుకు సంబందించిన ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ ఆ సమస్య మళ్ళీ వచ్చిందని లేఖలో ఉంది. అంతేకాదు.. అమెరికా వెళ్లి కిడ్నీ మార్పిడి చేసుకున్నారని ఆ లేఖ సారాంశం. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. తనకు కిడ్నీ మార్పిడి జరగడం వల్ల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని... దీని వల్ల ఎవరిని కలుసుకోలేకపోతున్నానని...తనకు ప్రాణభయం ఏమీ లేదని లేఖలో రాసి ఉంది. ఇది కాస్తా తమిళనాడులో సంచలనంగా మారింది. రాజకీయాలకు తలైవా టాటా చెప్పాడని మీడియా సైతం కోడై కూసింది.

మీడియాలో వస్తున్న వార్తలతో రజనీ అభిమానులు ఆందోళన చెందారు. దీంతో ఈ వైరల్ న్యూస్ పై సోషల్ మీడియా ద్వారా రజనీకాంత్ స్పందించారు. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలన్నీ నిజమేనని ఆయన తెలిపారు. కిడ్నీ సమస్య తలెత్తిందని చికిత్స చేయించుకున్నానని వివరించారు. కానీ ఆ లేఖ రాసింది మాత్రం తాను కాదని క్లారిటీ ఇచ్చారు.

రజనీకాంత్ వివరణతో ఆయన ప్రత్యర్థులు అనేక రకాల ఉద్దేశాలను ఆపాదించడం ఇప్పుడు వివాదంగా మారుతోంది.  కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటెడ్ పేషెంట్ అయిన రజనీకాంత్ బయట విస్తృతంగా తిరిగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు కలిగే పరిస్థితి ఉందని.,  కాబట్టి ఇప్పట్లో ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే పార్టీ ప్రకటన పై ఆలోచిస్తానని ఆ లేఖలో ఉంది.  దీనిపై త్వరలో మక్కల్ మంద్రం సభ్యులతో కలిసి చర్చించాక  రాజకీయ పార్టీకి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తానని తలైవా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: