నాగచైతన్యకు లవ్ స్టోరీలు బాగానే సూట్ అవుతున్నా.. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకునే కల మాత్రం ఇంకా మిగిలే ఉంది. ప్రస్తుతం చైతన్య చేతిలో ఉన్న రెండు సినిమాలు కూడా లవ్ స్టోరీలే. ఒక సినిమాపేరు ఏకంగా లవ్ స్టోరీ కావడం విశేషం. ఈ రెండు సినిమాల తర్వాత మాత్రం మళ్లీ తనలోని యాక్షన్ హీరోని తట్టి లేపబోతున్నారు చైతన్య.

లవ్ స్టోరీలు ఎన్నిపడినా.. మాంచి మాస్ మసాలా యాక్షన్ మూవీ ఒక్కటి పడితే హీరో రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. అందుకే హీరోల వారసులంతా.. యాక్షన్ మూవీస్ వెంట పరిగెడుతుంటారు. ఆ పరుగులో కింద పడ్డా కూడా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. జోష్ సినిమాతో కాలేజీ స్టూడెంట్ గా పరిచయమైనా నాగచైతన్యకు యాక్షన్ మూవీస్ అచ్చిరాలేదు. చైతన్య చేసిన లవ్ స్టోరీలే ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. నాగార్జునకు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ ని కంటిన్యూ చేశాయి.

అయితే చైతన్యకు మాత్రం తనని తాని ఓ యాక్షన్ హీరోగా నిరూపించుకోవాలనే కోరిక ఎక్కువ. అందుకే సవ్యసాచిలాంటి ప్రయోగాలను ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. తాజాగా సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో చైతన్య ఓ సినిమాని ఒప్పుకున్నట్టు సమాచారం. యాక్షన్ కింగ్ అనే పేరున్న అర్జున్.. ఇటీవల కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. లాక్ డౌన్ టైమ్ లో నాగచైతన్యకు అర్జున్ ఓ స్టోరీ వినిపించారని, ఇది ఆయనకు బాగా నచ్చిందని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తర్వాత, విక్రమ్ కుమార్ తో చేస్తున్న థ్యాంక్యూ సినిమా సెట్స్ పైకి వెళ్తారు చైతన్య. ఆ రెండూ పూర్తయిన తర్వాత అర్జున్ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ చేస్తారు. మొత్తమ్మీద నాగ చైతన్య కల మరోసారి నటుడు అర్జున్ రూపంలో తీరబోతోందనమాట. అయితే అర్జున్ అయినా చైతన్యను యాక్షన్ హీరోగా నిలబెడతారా లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: