గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ రోజు మన మధ్య లేరు. ఆయన దాదాపుగా నలభై వేల  పై చిలుకు పాటలు పాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన చేయని ప్రక్రియ లేదు. అటు పాడుతూ ఇటు డబ్బింగ్ చెప్పారు. మరో వైపు సంగీత దర్శకత్వం చేశారు. ఇంకో వైపు నటించారు. అలాగే సినిమాలు తీశారు. ఇక వ్యాఖ్యాతగా ఆయన రికార్డు మరో ఎత్తు. అలాగే పాడుతా తీయగా వంటి అద్భుతమైన కార్యక్రమాన్ని పాతికేళ్ళుగా సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన ఘనత కూడా బాలూదే.

బాలూ తెలుగు వాడు అంటే  అసలు నమ్మరు తమిళులు. ఆయనను తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఇక కన్నడీగులు బాలు మా ప్రాణం అంటారు. ఆయన కరోనాతో సెప్టెంబర్  25న మరణించారు. ఆయన చనిపోయాక కర్నాటకలో  ఒక వీధికి బాలూ పేరు పెట్టారని వార్త వచ్చింది. అలా వారు బాలూ రుణం తీర్చుకున్నారు.

ఇక తమిళులు బాలూని అసలు మరచిపోవడంలేదు. తాజాగా ఎస్పీబీ డబ్బింగ్ స్టూడియోను చెన్నైలో ప్రారంభించారు. సీనియ‌ర్ న‌టుడు ద‌క్షిణాది సినీ, టెలివిజ‌న్ ఆర్టిస్టుల యూనియ‌న్ అధ్య‌క్షుడు రాధార‌వి దీనిని ప్రారంభించారు. బాలూ మరణించిన తరువాత రాధారవి ఆయన పేరు మీద డబ్బింగ్ స్టూడియో ప్రారంభిస్తానని ప్రకటించారు. దానికి తగినట్లుగానే ఆయన ఆ పని పూర్తి చేశారు.

బాలూ ఎందరో ఉద్దండులైన సినిమా తారలకు డబ్బింగ్ చెప్పారు. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు ఉన్నారు. అలాంటి బాలూ పేరిట డబ్బింగ్ స్టూడియో అంటే ఆయన్ని ప్రతీ రోజూ మననం చేసుకున్నట్లే. మొత్తానికి తమిళులు, కన్నడీగులు బాలూ రుణాన్ని తీర్చుకున్నారు. అక్కదే మళ్ళీ పుట్టాలని కూడా  కోరుకుంటున్నారు. కానీ బాలూ తెలుగువాడు. మరి మన తెలుగు సీమ ఏమిచ్చి రుణం తీర్చుకుందో. ఇదే ప్రతీ తెలుగు వాడి మదిలో మెదిలే బాధ, ఒక ఆవేదనగా ఉంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: