ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ ‘నెట్‌ ఫ్లిక్స్’కు భారత్‌లో వరుస వివాదాలే స్వాగతం పలుకుతున్నాయి. ఇటీవల లాక్ డౌన్ కారణంగా భారత్‌లో ఓటీటీల బిజినెస్ బాగా అభివృద్ధి జరిగింది. దీంతో నెట్ ఫ్లిక్స్ కూడా భారతీయ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇటీవలే ‘బిలియనీర్ బ్యాడ్ బాయ్స్’ అంటూ ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రముఖుల గురించి ఓ వెబ్ సిరీస్ నిర్మించింది. కానీ అది వివాదాలకు దారి తీసింది. దీనిపై సత్యం రామ లింగరాజు కోర్టుకు కూడా వెళ్లారు.

దీంతో ఆయన ఎపిసోడ్ కాకుండా మిగతా ఎపిసోడ్లనే తొలుత విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు ఈ ఓటీటీ జెయింట్ కు మరో వెబ్ సిరీస్ తల నొప్పులు తీసుకొచ్చింది. అదే ‘ఎ సూటబుల్ బాయ్’. ఈ వెబ్ సిరీస్ పై ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. హిందువుల మనోభావాలు కించ పరిచేలా దీనిలో కొన్ని సన్ని వేశాలు ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్‌పై కేసు కూడా వేశారు. దీనంతటికీ కారణం ఆ వెబ్ సిరీస్‌లో ఓ ఆలయ ప్రాంగణంలో ముద్దు సన్నివేశాలు చిత్రించడమే.

 ఈ కథలో భాగంగా ఇద్దరు నటీనటులు ఓ ఆలయం వద్ద ముద్దు పెట్టుకుంటారు. ఈ సీన్ చూసిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్ ఫ్లిక్స్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంబికా ఖురానాపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు.

ఈ సన్నివేశాలను వెబ్ సిరీస్‌లో తొలగించి,  క్షమాపణ చెప్పాలని భారతీయ యువ మోర్జా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం విషయంలో నెట్ ఫ్లిక్స్ దిగొస్తుందా? లేదా అని తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: