చిత్ర పరిశ్రమలో చాలా మంది ఆర్టిస్టులు సినిమా కోసం ప్రాణం పెట్టి ప‌ని చేస్తుంటారు. మంచి పాత్ర దొరికితే దాని కోసం ఎంత రిస్క్ అయిన చేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వెయ్యరు. అలాంటి వారిలో క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్, అజిత్, రామ్ ఇలా త‌దిత‌ర హీరోలు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బీ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న టాలెంట్ ఏంటో నిరూపించుకునేందుకు స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వార‌సుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం బాబ్ బిస్వాస్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగ్ కోల్‌కతాలో తాజాగా తిరిగి ప్రారంభమయ్యింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం కోల్‌క‌తాలో షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, అభిషేక్ బ‌చ్చ‌న్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో ఆయ‌న బ‌ట్ట‌త‌ల‌తో  క‌ళ్ల‌జోడు పెట్టుకొని క‌నిపిస్తున్నాడు.  2012లో విద్యాబాలన్‌ ప్రధానపాత్రలో కలిసి నటించిన కహానీ చిత్రంలోని కాంట్రాక్ట్‌ కిల్లర్‌ బాబ్‌ బిస్వాస్‌ పాత్రలో అభిషేక్‌ నటిస్తున్నారు.

సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తెర‌కెక్కిన  కహానీ చిత్రంలో  కోల్డ్‌ బ్లడెడ్‌ కిల్లర్‌గా బిస్వాస్ అదర‌గొట్టాడు. ఆయ‌న పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.  ప్రముఖ బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ పోషించిన ఈ పాత్రలో తాజగా అభిషేక్‌ నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ తన గెటప్ పూర్తిగా మార్చుకుని అందరికీ షాకిచ్చాడు. బాబ్ బిశ్వాస్ సినిమా కోసం మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించడానికి చెదిరిన జుట్టు, పెద్ద కళ్లజోడు, కాస్త బరువుతో కనిపించాడు. అభిషేక్‌ సరసన చిత్రాంగద నటిస్తోంది. షారుక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుజోయ్‌ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చిత్రాంగద సింగ్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం అభిషేక్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: