టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మంచి జోరు మీద ఉంది. వరుస పెట్టి సినిమాలు చేసేస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగులోనే కాదు హిందీలో కూడా సినిమాలు ఒప్పుకుంటూ యమ స్పీడు చూపిస్తోంది. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ టైం అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ పూజ ఎందుకింత ఎగ్జయిట్ అవుతుందో తెలుసా? ఆమె అభిమాన హీరోలో హీరోయిన్‌గా నటించే అవకాశం  దొరికినందుకే. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. తెలుగులో వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ముకుంద’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన పూజ.. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలో తన అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంది.

 అనుకున్నట్లే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి నటించే అవకాశం కొట్టేసింది. హృతిక్‌తో కలిసి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘మొహంజదారో’లో నటించింది. దీనికోసం కెరీర్ పీక్స్‌లో ఉండగా రెండేళ్లు కాల్‌షీట్స్ కేటాయించింది కూడా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బాలీవుడ్‌లో ఆమె కెరీర్‌పై మచ్చలా మారిపోయింది. అయితే ఆ తర్వాత తేరుకున్న పూజ.. గతేడాది ‘హౌస్‌ఫుల్ 4’లో నటించింది. ఈ చిత్రం ఆమెకు భారీ విజయాన్ని కట్టబెట్టింది.

ఇప్పుడు అదే ఊపులో సల్మాన్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. సల్మాన్ త్వరలో చేయబోతున్న ‘కభీ ఈద్.. కబీ దివాలీ’’ చిత్రంలో పూజనే హీరోయిన్ అట. ఈ విషయం తెలియడంతో పూజ సంతోషానికి హద్దు లేకుండా పోయింది. తన కెరీర్‌లో ఇదే అత్యంత హ్యాపీ మూమెంట్ అని ఆమె చెప్తోంది. జోరు మీద ఉన్న పూజ కెరీర్‌లో ఇంకా ఎన్ని భారీ చిత్రాలు చేరతాయో చూడాలి మరి. హిందీలో కూడా వరుస పెట్టి ఆఫర్లు రావడం మాత్రం కచ్చితంగా మన బుట్ట బొమ్మ ట్యాలెంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: