దర్శకధీరుడు రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫైటింగ్‌ మాత్రం ఆగడం లేదు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గొడవపడుతూనే ఉన్నారు. ఒకళ్లు వ్యూస్‌లో తమదే రికార్డ్ అంటే,  మరొకరు లైక్స్‌లో తామే  టాప్ అని కామెంట్లు విసురుకుంటున్నారు. మరి టీజర్స్‌ దగ్గరే గొడవలు జరుగుతున్నాయంటే హీరోలు కలిసినా, ఫ్యాన్స్‌ కలవడం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనాతో ప్రపంచమంతా భయపడుతోంటే, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం 'ట్రిపుల్‌ ఆర్'ని భయపెడుతున్నారు. ఒకళ్లని ఎక్కువ చేసి మరొకళ్లని తక్కువ చేసినా, ఒక్కరినే హైలైట్‌ చేసినా యుద్ధం తప్పదు అన్నట్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. టీజర్‌లో ఒకళ్లు కనిపిస్తే, మరొకరు వినిపించేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నా అభిమానుల గొడవలు మాత్రం ఆగడం లేదు.

రామ్‌ చరణ్‌ బర్త్‌డేకి మార్చి 27న రామరాజు టీజర్‌ని రిలీజ్‌ చేసింది 'ట్రిపుల్ ఆర్' యూనిట్. అలాగే కొమరం భీమ్ జయంతి సందర్భంగా అక్టోబర్ 22న భీమ్‌ టీజర్‌ని రిలీజ్ చేసింది. అయితే 7 నెలల గ్యాప్‌తో రిలీజైన ఈ టీజర్స్‌లో తారక్‌ తెలుగు టీజర్‌కి 10 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. కానీ 7నెలల ముందు రిలీజైన చరణ్‌ తెలుగు టీజర్‌కి మాత్రం 9 లక్షల్లోపే లైక్స్‌ వచ్చాయి. దీంతో తారక్ అభిమానులు మావోడే గొప్ప అని కామెంట్ చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ టీజర్‌కి 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే జూ.ఎన్టీఆర్ టీజర్‌ మాత్రం 33 మిలియన్‌ మార్క్ దాటలేదు. దీంతో చరణ్‌ అభిమానులు మావోడే గొప్ప అని కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ గొడవలు చూస్తోంటే హీరోలు కలిసినా, అభిమానులు ఇంకా కలవలేదనే చెప్పాలి. అయితే ఈ గొడవలు ఇలాగే కంటిన్యూ అయితే 'ట్రిపుల్ ఆర్'పైనా ప్రభావం పడే ప్రమాదముంది. మరి బ్లాక్‌బస్టర్స్‌తో చాలాసార్లు బాక్సాఫీస్‌ని గెలిచిన రాజమౌళి, ఈ ఫ్యాన్స్‌ని ఎలా గెలుచుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: