ఓటీటీలు థియేటర్లకి ప్రత్యామ్నాయం కావని నిర్మాతలు చాలా స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. మళ్లీ సినిమా హాళ్లు ఓపెన్‌ కాగానే పాత రోజులు తిరిగొస్తాయని ఆశల్లో ఉన్నారు. కానీ పరిస్థితులు చూస్తోంటే ఓటీటీలు థియేటర్లని మింగేస్తున్నట్లే కనిపిస్తోంది. మరి ఫ్యూచర్‌లో థియేటర్‌ ఇండస్ట్రీ ఎలా ఉండబోతోందనే సందేహాలు తలెత్తుతున్నాయి.

కరోనా లాక్‌డౌన్‌లో థియేటర్లు మూతబడ్డాక ఓటీటీ మార్కెట్‌ పెరిగిపోయింది. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కలర్‌ ఫోటో' లాంటి చిన్న సినిమాలు 'వి' లాంటి మీడియం బడ్జెట్‌ మూవీస్‌ కూడా ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. దీంతో మున్ముందు థియేటర్‌ బిజినెస్‌ తగ్గుతుందనే కామెంట్స్‌ కూడా వచ్చాయి.

ఓటీటీలతో థియేటర్లకి ప్రమాదం అనే కామెంట్స్‌ వచ్చినప్పుడల్లా, థియేటర్లు తెరిస్తే మళ్లీ మంచి రోజులొస్తాయని చాలా నమ్మకంగా చెప్పారు ఎగ్జిబిటర్లు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే మరో ఏడాది వరకు థియేటర్ల కష్టాలు తీరేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు రీఓపెనింగ్‌కి  పర్మిషన్‌ ఇచ్చినా, ప్రొడ్యూసర్లు సినిమాలు రిలీజ్‌ చెయ్యడానికి ఆసక్తి చూపించట్లేదు. నాగార్జున 'వైల్డ్‌డాగ్' కూడా ఓటీటీకి వెళ్తుందనే కామెంట్స్‌ వస్తున్నాయి.

తెలుగులో ఇప్పటివరకు టాప్ హీరోలెవరు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్‌ చెయ్యలేదు. రామ్‌ లాంటి హీరోలు కూడా థియేటర్లు ఓపెనింగ్‌ కోసమే చూస్తున్నారు గానీ, డిజిటర్‌ రిలీజ్‌కి వెళ్లలేదు. కానీ ఇప్పుడు నాగార్జున ఓటీటీకి వెళ్తున్నాడనే ప్రచారం జరుగుతోందంటే, థియేటర్లని ఇంకా కరోనా భయం విడిచిపెట్టలేదనే తెలుస్తోంది. సో ఈ భయం తగ్గేవరకు థియేటర్లకు కష్టాలు తప్పవనే చెప్పాలి.

మొత్తానికి సినిమాలు సిద్ధం చేసుకున్న నిర్మాతలు ఆ సినిమాలు విడుదల చేసేందుకు తెగ జంకుతున్నారు. కరోనా దెబ్బకు ప్రేక్షకులు థియేటర్లో అడుగు పెట్టరనే విషయం సినిమా దర్శక, నిర్మాతలకు తెలిసిపోయింది. అంతేకాదు 50శాతం ఆక్యుపెన్సీకి ఒప్పుకోని చిత్ర యూనిట్.. రిలీజ్ కు నో చెబుతోంది. ఇంకేముందీ కరోనా లాక్ డౌన్ లో ఓటీటీ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: