హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌కు చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పరిస్థితి. ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రజల మద్దతును భారీగా కో్ల్పోయింది. మొత్తం 150  జీహెచ్‌ఎంసీ స్థానాల్లో 55 డివిజన్లను మాత్రమే సొంతంచేసుకోగలిగింది. ఇక బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 48 స్థానాల్లో విజయ ఢంకా మోగించగా.. 44 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 44 స్థానాలనూ సొంతం చేసుకుంది. అయితే జీహెచ్‌ఎంసీలో అధికారం సొంతం చేసుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీస మ్యాజిక్ ఫిగర్ 99ని చేరుకోవాల్సి ఉంది. అయితే ఎక్స్‌అఫీషియో జాబితాలో ఉన్న 49 మందిలో అధికార టీఆర్‌ఎస్‌కు 35 మంది సభ్యుల మద్దతుంది. మజస్లిస్‌కు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు మద్దతుగా ఉన్నారు. వీరిలో కూడా వేరే ప్రాంతాల నుంచి నమోదైన కొందరిని, పరిధిలో లేకుండా నమోదైన టీఆర్‌ఎస్‌ సభ్యులను జీహెచ్‌ఎంసీ జాబితా నుంచి తొలగించనున్నారు. దీంతో ఏ వైపు నుంచి చూసినా టీఆర్‌ఎస్‌‌ ఎక్స్‌‌ అఫిషియో బలం 34 దాటేలా కనపడడం లేదు.    

ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి టీఆర్‌ఎస్‌ బలం 89మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్‌ 99ని చేరుకునే పరిస్థితులు లేవన్నమాట. ఈ నేపథ్యంలోనే మజ్లిస్‌తో కలిసి ముందుకు సాగక తప్పదని గులాబీదళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? ఎంఐఎం తిట్టిన నోటితోనే పొగుడుతూ.. మళ్లీ పొత్తు పెట్టుకుంటారా..? అనే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే పొత్తు లేనిదే అధికారం చేజిక్కించుకోవడం మాత్రం గులాబీ పార్టీకి కలగానే మరనుందనేది నిపుణుల వాదన.

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తీరుతో మేయర్‌ ఎన్నిక సమయంలో ప్రతిష్టంభన తప్పదనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌ కీలకంగా మారనుంది. టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ బేషరతుగా మద్దతునిస్తుందా? లేక మేయర్‌ లేదా డిప్యూటీ మేయర్‌ పదవులను కోరుతుందా? అనేది తేలాల్సి ఉంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: