కొన్ని సెంటిమెంట్లు అలా సెట్ అవుతాయంతే. వాటికి లాజిక్కులు తీయకూడదు. గుడ్డిగా ఫాలో అయిపోవాలంతే. వాటికి దక్కిన రిజల్ట్స్ చూసి అయినా నమ్మేయాల్సిందే. నిజానికి ఏ రంగంలో లేనన్ని సెంటిమెంట్లు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాయని అంటారు. దానికి కారణాలు కూడా అనేకం. కోట్లు పోసి రీళ్ళుగా మార్చి లక్ ని చూసుకునే సినీ లోకానికి కాసులు రాలకపోతే అంతకంటే షాక్ ఉండదుగా.

అందుకే కలెక్షన్ల పంట కోసం ఎంతైనా చేస్తారు. సెంటిమెంట్ అంటూ చాలానే చేస్తారు. విషయానికి వస్తే టాలీవుడ్ లో ఇపుడు కొత్త సెంటిమెంట్ పట్టుకుంది. అదేంటి అంటే ఠక్కున హిట్ కొట్టాలి అంటే ఖాకీ చొక్కా అర్జంట్ గా  తొడిగేయాల్సిందేనట. ఇప్పటిదాకా ఖాకీ చొక్కాను నమ్ముకుని వమ్ము అయిన వారు ఎవరూ లేరు అని కూడా అంటున్నారు.

టాలీవుడ్ లో వరస ఫ్లాప్ తో ఉన్న రవితేజా ఖాకీ చొక్కా తొడికేసి క్రాక్ అంటూ థియేటర్లలోకి దూసుకు వచ్చేశాడు. ఇంకేముందు బొమ్మ సూపర్ హిట్ అయిపోయింది. దీనికి ముందు నాలుగైదు సినిమాలు ఫ్లాప్ కావడంతో మాస్ మహరాజా పని అయిపోయింది అన్న వారు ఉన్నారు. కానీ క్రాక్ సూపర్ హిట్ దెబ్బకు రవి తేజా మరింతకాలం ఇండస్ట్రీలో కొనసాగేందుకు రెడీ అవుతున్నాడు.

అప్పట్లో మహేష్ బాబు కూడా కొన్ని ఫ్లాప్స్ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో దూకుడు అంటూ శ్రీనూ వైట్ల తీసిన మూవీలో ఖాకీ డ్రెస్ తొడిగాడు అంతే. దెబ్బకు సక్సెస్ ట్రాక్ లోకి పడింది బండి. ఇలాగే జూనియర్ ఎన్టీయార్ కి కూడా ఫ్లాప్స్ వరసపెట్టి పలకరిస్తున్న వేళ టెంపర్ మూవీతో పూరీ జగన్నాధ్ హిట్ పట్టాలెక్కించాడు. అందులో ఖాకీ చొక్కా తొడీన జూనియర్ నటనలో ఓ రేంజిలో చెలరేగిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా గబ్బర్ సింగ్ లో ఖాకీ చొక్కా ఇచ్చిన కిక్ తో అంతకు ముందు ఫ్లాప్స్ అలా తుడిచి పెట్టుకుపోయాయి. దాంతో ఇపుడు కొంతమంది ఫ్లాప్ హీరోలు ఖాకీ చొక్కా తొడిగేద్దామనుకుంటున్నారుట.

మరింత సమాచారం తెలుసుకోండి: