టాలీవుడ్ సంగీత దర్శకులలో మణిశర్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది.  టాప్ హీరోల సినిమాలకు మణిశర్మ పాటల స్వరాలు అదనపు ఆకర్షణగా నిలవడమే కాకుండా మెలోడీ బ్రహ్మగా ఈసంగీత దర్శకుడు సుమారు ఒక దశాబ్దం పాటు  శాసించాడు. కేవలం పాటల బాణీకి సంబంధించి  మాత్రమే కాదు సినిమాలకు సంబంధించి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడం లో ఆయనకు ఎదురులేదు.  


అలాంటి మెలోడీ బ్రహ్మకు ‘నారప్ప’ విషయంలో చేదు అనుభవం ఎదురైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తో తిరిగి ట్రాక్ లోకి రావడంతో ప్రస్తుతం మణిశర్మ చేతిలో చాల బడా సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ ‘నారప్ప’తో పాటు చిరంజీవి ప్రత్యేకంగా ‘ఆచార్య’ మూవీ కోసం మణిశర్మ ను ఎంచుకున్నాడు అంటే ఆయన స్థాయి అర్థం అవుతుంది.


తమిళంలో ఘన విజయం సాధించిన ‘అసురన్’ రీమేక్ గా నిర్మాణంలో ఉన్న ‘నారప్ప’ మూవీ టీజర్ కు సంబంధించి అనుకోకుండా మణిశర్మ కు చేదు అనుభవం ఎదురైంది. ‘నారప్ప’ సినిమాకు సంబంధించి ఇటీవల  విడుదలైన టీజర్ లో తమిళ మూవీ అసురన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మణిశర్మ ప్రమేయం లేకుండా యాడ్ చేసి విడుదల చేయడమే కాకుండా ఆ టీజర్ లో మణిశర్మ పేరును కూడ వేసారు.


దీనితో మణిశర్మ ‘అసురన్’ బ్యాక్ గ్రౌండ్  స్కోరును కాపీ కొట్టాడు అంటూ విపరీతమైన విమర్శలు రావడం ఆ విషయం మణిశర్మ దృష్టి వరకు వెళ్ళడం జరిగిందట. తెలుగులో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న మణిశర్మ పై అతని ప్రేమేయం లేకుండానే ఇలా కాపీ రిమార్కులు రావడం ఆయనకు బాధ కలిగించినట్లు టాక్. అయితే ‘నారప్ప’ మూవీ మేకర్స్ ఇలా ఎందుకు ప్రవర్తించారు అన్న విషయమై ప్రస్తుతానికి సమాధానాలు లేవు. ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ దర్శకుడుగా ఒక ముద్ర వేయించుకున్న శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’ ను ఎలా డీల్ చేస్తాడు అన్న విషయమై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: