నీ మీద నాకు ఇదయ్యే.. అంటూ రాక్షసుడు సినిమాలో చిరంజీవితో కలిసి డ్యాన్సు చేసిన అందాల నటి గుర్తుందా.. ఆమె పేరు జయమాల. ఒకప్పుడు ఆమె కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2018లో కుమారస్వామి మంత్రి వర్గంలో జయమాల ఉమెన్ అండ్ చైల్డ్ డెవలెప్ మెంట్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కన్నడ కేబినెట్ లో ఏకైక మహిళా మంత్రిగా రికార్డ్స్ క్రియేట్ చేశారు. అంతకు ముందు జయమాల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యాక్టివ్ మెంబర్ గా ఉండేవారు. తర్వాత పార్టీ తరపున విధాన పరిషత్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  ఆమె సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ .. మంత్రి వర్గంలో చోటిచ్చారు. కన్నడ నటిగా పలు చిత్రాల్లో అభిమానులను సంపాదించుకున్న జయమాల సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. గతంలో శబరిమల అయ్యప్పఆలయ గర్భగుడిలోకి వెళ్లి వార్తల్లోకెక్కారు. దక్షిణ కన్నడలో చిక్ మంగళూరులో జన్మించిన జయమాల.. కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు.  1974 నుండి 2018 వరకూ పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. కన్నడ రాజ్ కుమార్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అంబరీష్‌లతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. శకర్ గురు, గిరి కన్య లాంటి సూపర్ హిట్స్ మూవీలో నటించి అభిమానులను అలరించారు. అనంతరం తెలుగులో రాక్షసుడు మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ‘నీ మీద నాకు ఇదయ్యో...’ అంటూ స్టెప్పులేశారు.
జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ ను వివాహం చేసుకున్నారు. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామేన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్ళి చేసుకున్నారు. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉన్నారు. ఆమె కూడా హీరోయిన్‌గా రాణించింది. గాడ్ ఫాదర్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య... 2012లో టాలీవుడ్‌లో ‘మిస్టర్ ప్రేమికుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు.

జయమాల కర్ణాటకలోని గ్రామీణ స్త్రీల పునరావాసము అనే అంశంపై పరిశోధనలు చేసి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి 2008లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. ఆ విధంగా భారతీయ సినీ పరిశ్రమలో థీసిస్ రాసి డాక్టరేట్‌ పట్టా పొందిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు జయమాల. నటిగా, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షురాలిగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ కన్నడ రాజకీయాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: