సంక్రాంతి బరిలో రిలీజై బాగా ఆడుతూ.. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన క్రాక్ సినిమాకు కష్టాలు తప్పడం లేదు. ఈ సినిమాను నైజాంలోని కొన్ని థియేటర్ల నుంచి అర్ధాంతరంగా తొలగించారని గత కొద్ది రోజులుగా వరంగల్ శ్రీను అనే పంపిణీ దారుడు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు - శిరీష్ తమ సినిమాలను రిలీజ్ చేసుకునేందుకు క్రాక్ సినిమాకి అన్యాయం చేశారన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

అయితే ఈ వివాదం ఫిలిం చాంబర్.. నిర్మాతల మండలి వరకూ వెళ్లింది. క్రాక్ కు ఈ శుక్రవారం నుంచి థియేటర్లు ఎక్కువ ఇవ్వాలన్న డిమాండ్ ని వినిపిస్తూ వరంగల్ శ్రీనుతో పాటు నిర్మాత ఠాగూర్ మధు కూడా బరిలో దిగారని తెలిసింది. తెర వెనుక అసలేం జరిగిందో ఆ ఇద్దరూ చాంబర్ పెద్దలకు, నిర్మాతల మండలికి ఒకరి తర్వాత మరొకరు ఫిర్యాదు చేశారని సమాచారం.

క్రాక్ కి జరిగిన అన్యాయంపై ప్రతిదీ పూస గుచ్చినట్టు ఒక లేఖ రాసిన వరంగల్ శ్రీను.. దీన్ని కౌన్సిల్ కి అందించడంతో వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారట. ఆ తర్వాత ఈ లేఖపై, అలాగే సినిమా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపారట. ఇక ఈ కుంభ కోణంలో స్టాక్ శ్రీధర్ అనే వ్యక్తి హస్తం ఉందని మరో కొత్త విషయం వెలుగు చూసింది. థియేటర్ల యజమానులను ఈ వ్యక్తి బెదిరిస్తున్నారని మరో షాకింగ్ పాయింట్ బయట పడింది. దాంతో అప్రమత్తమైన నిర్మాతల మండలి.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చలు జరిపిందని సమాచారం. క్రాక్ కి  అన్యాయం జరిగినట్టే ఇకపై మరి ఏ ఇతర సినిమాకూ  జరగకుండా ఉండాలంటే.. తనకు దిల్ రాజు - శిరీష్ బృందం నష్ట పరిహారం చెల్లించాలని, అలాగే ఈ విషయంలో నిర్మాతల మండలి హామీ ఇవ్వాలని వరంగల్ శ్రీను కౌన్సిల్ ని కోరారట.

మరింత సమాచారం తెలుసుకోండి: