సీనియర్ నటీమణి ఆమని తన అద్భుతమైన నటనతో, తన అందచందాలతో 1990-2000 కాలం నాటి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆమె శుభముహూర్తం, శ్రీవారి ప్రియురాలు, కోయిలమ్మ, అమ్మ కొడుకు వంటి చిత్రాల్లో గ్లామర్ పాత్రలో నటించి కుర్రకారుకి చెమటలు పుట్టించారు. శుభలగ్నం సినిమాలో హేమిటో అంటూ భర్తను వేపుకు తినే భార్యగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. 1990 నుంచి 1997 వరకు 50 పై చిలుకు సినిమాల్లో నటించిన ఆమని 2002 లో తమిళ సినిమా నిర్మాత అయిన ఖాజా మొహియుద్దీన్ ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.

అయితే ఆమె భర్త నిర్మించిన సినిమాలు డిజాస్టర్స్ కావడంతో భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్థిక సమస్యలతో ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే ఆర్ధిక సమస్యలను అధిగమించడానికి ఆమె ఇక చేసేదేమీలేక మళ్ళీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. సీరియళ్లలో కూడా నటించడానికి ఆమె అంగీకరించారు. 2017 నుంచి ఆమె 6 సినిమాలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అర్థం సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే ఆమె లీడ్ రోల్ లో నటించిన "అమ్మ దీవెన" అనే సినిమా జనవరి 29వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నది. శివ ఏటూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే.. ఒక సాధారణ మహిళ ఎన్నో కష్టాలను, కన్నీళ్లను ఎదురొడ్డి తన ఐదుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడుతుంది తప్ప ఆమె ఆత్మహత్య చేసుకోదు. అయితే ఈ కథను బట్టి చూస్తుంటే ఆమని ఒక స్ఫూర్తిదాయకమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.

అయితే శుక్రవారం రోజు విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆమని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత కూడా తనకు అమ్మ దీవెన వంటి మంచి సినిమాలలో ఛాలెంజింగ్ రోల్స్ పోషించే ఆఫర్లు వస్తున్నాయని.. అందుకు తాను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. విభిన్నమైన పాత్రలతో గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలనే తపన తనలో బాగా ఉందని కానీ ప్రతిసారి మనసుకు నచ్చిన పాత్రలు రావడం అనేది అసాధ్యమని.. అందుకే మనసుకు నచ్చకపోయినా అన్ని పాత్రలు చెయ్యాల్సిందే అని ఆమని చెప్పుకొచ్చారు. గీతా ఆర్ట్స్ లో మూడు సినిమాలు, ఆర్కా మీడియా లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: