ఎంతో కాలం పాటు దర్శకేంద్రుడిగా కెమెరా వెనుకనే ఉండిపోయిన రాఘవేంద్రరావు తొలిసారిగా మేకప్ వేసుకుని నటుడిగా కెమెరా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. జనార్ధన మహర్షి రాసిన ఒక కథను ఆధారంగా చేసుకుని తనికెళ్ల భరణి సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి 'ఓ బాబు' అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఈ సినిమాకి దర్శకుడు భరణీ అయినా, ఈ సినిమా మేకింగ్ అంతా దర్శకేంద్రుడి పాత పంథాలోనే సాగుతుందట. 

నిజానికి ఒకప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ఒకప్పటి రాజుల సభలా ఉండేవి, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, డాన్స్ మాస్టర్ ఇలా పాటలకు సంబంధించి కీలక పాత్ర పోషించే వారంతా జన జీవనానికి దూరంగా ఒక చోట కూర్చుని పాటల మీద కసరత్తులు చేసేవారు. అందుకే అప్పట్లో అద్భుతమైన పాటలు జనాల్లోకి వచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. దర్శకుడు ఓ చోట సంగీత దర్శకుడు మరో చోట గీత రచయిత ఇంకోచోట అలా వీరంతా ఆన్లైన్ లో మాట్లాడేసుకుని సంగీతాన్ని పుట్టించేస్తున్నారు. అందుకే గత సినిమాలతో పోలిస్తే ఇప్పుడు వచ్చే సినిమాలు సంగీతం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.

 అయితే తాను నటించబోయే సినిమాకి సంగీతం కూడా బాగుండాలనే కోరికతో దర్శకేంద్రుడు తన పాత పంధాలో సిట్టింగ్స్ వేద్దామని భరణి కోరాడట. అందుకు ఒప్పుకున్న భరణిసినిమా యూనిట్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ రిసార్ట్ బుక్ చేశాడట. ఈ యూనిట్ అంతా అక్కడ మూడు రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా నిర్వహించారని తెలుస్తోంది. ఈ సిట్టింగ్ లో సినిమాకి సంబంధించిన ప్రధాన తారాగణం అలాగే సాంకేతిక నిపుణులు అందరూ కలిసి పాల్గొన్నారట. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండటంతో ఆయన సీనియారిటీ ప్రకారం ఈ మూడు రోజుల్లోనే ట్యూన్స్ అన్ని రెడీ చేశారని, అప్పటికప్పుడే చంద్రబోస్ చేత పాటలు కూడా రాయించారని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: