తెలుగునాట సీక్వెల్స్‌ పెద్దగా హిట్‌ కావనే సెంటిమెంట్ ఉంది. అందుకే చాలామంది డైరెక్టర్లు సీక్వెల్స్‌ గురించి ఆలోచించరు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ఫ్లాపుల నుంచి బయటపడటానికి సీక్వెల్స్‌నే నమ్ముకున్నారు.

శ్రీను వైట్ల సరైన హిట్‌ చూసి చాలా కాలమైంది. 'ఆగడు' నుంచి వైట్లకి వరుస ఫ్లాపులొచ్చాయి. 8 ఏళ్ల నుంచి హిట్ కోసం ఫైట్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్‌ మాత్రం రావడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా సరే సక్సెస్‌ ట్రాక్ ఎక్కాలని 'ఢీ' సీక్వెల్‌ స్టార్ట్ చేశాడు. మంచు విష్ణుతో 'డీ అండ్ డీ' అనే సినిమా మొదలుపెట్టాడు. ఈ మూవీ కోసం మంచు విష్ణు కూడా చాలా కష్టపడుతున్నాడు.  డబుల్ ఢీతో మళ్లీ హిట్‌ కొట్టాలని ఆశపడుతున్నాడు.

'కార్తీకేయ, ప్రేమమ్' సినిమాలతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చందు మొండేటికి 'సవ్యసాచి'తో బ్రేకులు పడ్డాయి. చందు మొండేటి యాక్షన్‌ స్టోరీని సరిగా హ్యాండిల్ చెయ్యలేదనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడీ ఫ్లాపుల నుంచి బయటపడ్డానికి 'కార్తికేయ2' తీస్తున్నాడు దర్శకుడు. 'కార్తికేయ1'లో యానిమల్ హిప్నాటిజం గురించి చెప్పిన చందు, ఈ సీక్వెల్‌లో ఏం డిస్కస్ చేస్తాడన్నది ఆసక్తికరంగా  మారింది.

'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో సక్సెస్‌ ట్రాక్ ఎక్కినట్లే కనిపించాడు తేజ. కానీ ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌తో తీసిన 'సీత' సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో కొంచెం అప్‌ అండ్‌ డౌన్స్‌లో ఉన్న తేజ ఇప్పుడు 'చిత్రం' సీక్వెల్‌ తీస్తున్నాడు. 21 ఏళ్ల క్రితం తేజ ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టాడు. మళ్లీ ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా 'చిత్రం వన్ పాయింట్ వన్' మొదలుపెట్టాడు తేజ. మొత్తానికి సీక్వెల్స్ తో సత్తా చాటాలని దర్శకులు ఆరాటపడుతున్నారు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్స్ చేసేందుకు శ్రీను వైట్ల రెడీ అవుతున్నాడు. చూద్దాం.. హిట్ సాధిస్తాడో లేదో.



మరింత సమాచారం తెలుసుకోండి: