నాని బర్త్ డే రోజు అభిమానులకు వరస గిఫ్టులు వస్తున్నాయి. ఇప్పటికే ఈయన నటిస్తున్న టక్ జగదీష్ టీజర్ విడుదలై సంచలనం రేపుతుంది. ఇప్పుడు ఈయన నటిస్తున్న మరో సినిమా శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన రోజు నుంచే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. వింటేజ్ లుక్‌లో ఉన్న నాని.. ఏకంగా భగత్ సింగ్‌ను గుర్తు చేస్తున్నాడు. కోల్‌కత్తా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం. ఫిబ్రవరి 24న ఈయన పుట్టిన రోజు సందర్భంగా శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. కోరమీసాలతో ఉన్న నానిని చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. టక్ జగదీష్‌లో నీట్‌గా టక్ చేసి మాస్ లుక్‌లో కనిపించిన నాని.. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తైపోయింది.

సత్యదేవ్ జంగా ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ టాక్సీవాలా తర్వాత రాహుల్ సంక్రీత్యన్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కృతి శెట్టి 25 లక్షలు పారితోషికం అందుకుంటుంది. శ్యామ్ సింగ రాయ్ నానికి చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే ఇది ఈయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. కథ డిమాండ్ చేయడంతో దాదాపు 40 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు వెంకట్ బోయినపల్లి.నిహారిక మూవీస్ బ్యానర్‌పై శ్యామ్ సింగ రాయ్ వస్తుంది. ఫస్ట్ లుక్‌లో నానిని వెనక నుంచి ఓ అమ్మాయి కౌగిలించుకుని ఉండటం.. ఆమె మొహం దాచేయడంతో ఆసక్తి మరింత పెరిగిపోతుంది. షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేసి 2021 డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: