మంచి కారు కొనాలనే డ్రీమ్ అందరికీ ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు మంచి కార్లు కొని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఇక సినిమా స్టార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ స్టార్స్ తమ కెరీర్ తొలినాళ్లలో మొట్టమొదటిగా కొనేది కారే. అనసూయ, నిధి అగర్వాల్ ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో చిన్నపాటి నటీనటులు కోట్ల ఖరీదైన కార్లను కొని ఆశ్చర్యపరిచారు. వాళ్ల రేంజే కోట్లలో ఉంటే ఇక చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్ హీరోల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

చిరంజీవి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కార్ల విలువ అక్షరాలా పది కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా మూడు కోట్లకు పైగా విలువ చేసే పలు విదేశీ కార్లను కొనుగోలు చేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత విలువైన కారు కలిగిన హీరోగా ప్రభాస్ నిలుస్తున్నారు. ఈయన రూ. 7 కోట్లు ఖర్చు చేసి రోల్స్ రాయల్స్ ఫాంటమ్ కారు కొన్నారు. ఐతే ఏ-లిస్ట్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేయడంలో ముందంజలో ఉంటారు.

తాజాగా తారక్ లంబోర్ఘిని ఉరుస్ అనే అత్యంత విలాసవంతమైన కారు ని బుక్ చేశారు. ప్రస్తుతం ఈ మోడల్ కార్లు ఇండియాలో అందుబాటులో లేవు. అందుకే ఆయన ఇటలీ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే అత్యంత విలాసవంతమైన ఈ కారు విలువ 5 కోట్ల రూపాయలు ఉంటుందని ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కలిపి దాదాపు ఆరు కోట్ల రూపాయలు అవుతాయి అని తెలుస్తోంది. ఈ మోడల్ కారు కేవలం హైవేల మీద మాత్రమే కాదు మట్టి రోడ్డుపై, ఎడారిలో కూడా వేగంగా ప్రయాణించగలదు. కొండ, గుట్ట ప్రాంతాల్లో కూడా ఈ స్పోర్ట్స్ కార్ లో సాఫీగా ప్రయాణం చేయవచ్చు. కోట్ల విలువ చేసే కార్లు కేవలం హైవేలపై మాత్రమే ప్రయాణించగలవు. కానీ తారక్ బుక్ చేసిన లంబోర్ఘిని ఉరుస్ మాత్రం ఎటువంటి ప్రాంతాల్లోనే ప్రయాణించగలగడం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నందుకు గాను తారక్ 40 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం. ఎవరు మీరు కోటీశ్వరులు అనే జెమినీ టీవీ రియాల్టీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు గాను 60 ఎపిసోడ్ లకు ఇరవై కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: