భర్తకు 25 ఏళ్లు, భార్యకు 60 ఏళ్లు.. ఇంతటి విచిత్రమైన కాంబినేషన్‌లో, వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. 'కేరింత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పార్వతీశం, సీనియర్ నటి  శ్రీలక్ష్మీ జంటగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  60 ఏళ్ల స్త్రీకి 25 సంవత్సరాల కుర్రాడు ఎలా భర్తగా మారాడనే విచిత్రమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. చిత్రం ఆసాంతం వినోదాత్మకంగా సాగుతుందని, ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుందని అంటున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇచ్చారు. బుధవారం నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

ఈ చిత్రం గురించి నటి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ''వైవిధ్యమైన ఎన్నో మేనరిజమ్స్‌తో ఎన్నో వెరైటీ పాత్రలు చేశాను. చాలా రోజుల తర్వాత మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాను. కాస్త లేట్ అయినప్పటికీ లేటెస్ట్ గా మంచి పాత్ర వచ్చింది. ఇంతవరకు నేను ఇటువంటి పాత్ర చేయలేదు. నా కొడుకు వయసున్న పార్వతీశం భర్తగా చేస్తున్నారు. యూత్ మొగుడు... వింటుంటే నాకే నవ్వొస్తుంది. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలం’టూ శ్రీలక్ష్మి అన్నారు.

హీరో పార్వతీశం మాట్లాడుతూ ‘కేరింత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. అంతకు మించి పేరు తీసుకొచ్చే పాత్ర ఈ సినిమాలో దొరకడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కథను నమ్మి మేమంతా ఈ సినిమా చేస్తున్నాం. శ్రీలక్ష్మీ మేడంతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నానం’టూ పార్వతీశం చెప్పుకొచ్చాడు.

దర్శకుడిగా తన తొలి చిత్రమే గొప్ప కథాంశంతో తీయనుండడం ఆనందంగా ఉందని దర్శకుడు చైతన్య కొండ అన్నారు. సినిమా కథ చెప్పగానే నిర్మాత నరేంద్రకు బాగా నచ్చేసిందని, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చైతన్య చెప్పారు. ఈ చిత్రం మంచి వినోదాత్మక చిత్రమని నిర్మాత గోగుల నరేంద్ర అన్నారు. ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుకునేలా చిత్రం ఉండబోతోందని అన్నారు. హైదరాబాద్‌లో 25 రోజులు, అవుట్ డోర్ లొకేషన్‌లో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం. 45 రోజుల్లో మొత్తం సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. పూజా కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ ఆషి రాయ్‌, గీత్‌ షా, ముస్కాన్‌ అరోరా, సంగీత దర్శకుడు ఎస్‌.కె. ఖద్దూస్‌, శివారెడ్డి, జనార్థన్‌ (జెన్నీ) తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: