ఎనిమిది సంవత్సరాల తర్వాత నాంది సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ తన తదుపరి సినిమాల స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పూర్తిగా కామెడీ సినిమాల పై ఆధారపడి దాదాపు ఎనిమిదేళ్ల పాటు హిట్స్ లేక ఎంతో బాధ అనుభవించిన అల్లరి నరేష్ ఎట్టకేలకు మంచి కథాబలం ఉన్న ఓ సీరియస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. అందుకే ఇకపై కూడా మంచి కథాబలం ఉన్న సినిమాలు చేయడానికే అల్లరి నరేష్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ కథలను కూడా వదులుకోవడం లేదు. కానీ జబర్దస్త్ టైప్ కామెడీ సినిమాలు మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.


నేను, గమ్యం వంటి సినిమాల్లో వైవిధ్యమైన నటనా ప్రదర్శన కనబరిచి విలక్షణ నటుడిగా పేరొందిన అల్లరి నరేష్ ఎటువంటి ఛాలెంజింగ్ రోల్ లోనైనా చేయగలరు. కానీ ఆయన మూస ధోరణిలో కామెడీ చిత్రాలు చేసుకుంటూ పోతూ..  తన నటన టాలెంట్ కి తగ్గట్టుగా సినిమాలు చేయకుండా తన సమయం వృధా చేసుకున్నారు. కానీ ఇకపై తన నటనా టాలెంట్ ని అస్సలు వృధా చేయకూడదని భావిస్తున్న అల్లరి నరేష్ మరొక కంటెంట్ డ్రైవన్ సినిమాకి సైన్ చేశారట. అయితే ఈ సినిమాకి కూడా విజయ్ కనకమేడల దర్శకత్వం వహించనున్నారని సమాచారం అందుతోంది.


నాంది సినిమాతో బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయలను వసూలు చేసి నిర్మాత సతీష్ వేగేశ్న కి భారీగా లాభాలు తెచ్చి పెట్టడంలో విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కీ రోల్ ప్లే చేశారు. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. దీనితో మళ్లీ వీరిద్దరి కాంబోలో వస్తున్న మరో సినిమాకి కూడా సతీశ్‌ వేగేశ్న నిర్మాతగా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.


ఇకపోతే నాంది సినిమా హిట్ కావడంతో ఇటీవల ఆయన తిరుమల తిరుపతి శ్రీవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో హిట్ కావాలని నరేష్ కోరుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: