సాధారణంగా జూన్ అంటే అందరికీ ఒక్కటే ఆలోచన వస్తుంది. పిల్లలకు ఆట విడుపు కాలం ముగిసిపోయి బడి పిలుపు కాలమది. అలాగే ఎక్కడెక్కడివారి తిరిగి గూటికి చేరి రెగ్యులర్ లైఫ్ లో పడిపోయే కాలం కూడా అదే. అయితే కరోనా వచ్చాక క్యాలండర్ మొత్తం మారిపోయింది.

ఆ మాటకు వస్తే ఎపుడేం చేయాలో కూడా అర్ధం కాని పరిస్థితి. ఇవాళా రేపూ ఎలా ఉంటుందో తెలియదు, అందువల్ల ఎల్లుడి గురించి ఆలోచన దండుగ అన్న వైరాగ్యాన్ని కరోనా వచ్చి ఇచ్చిన బహుమతి గా అనుకోవాలి. ఇక సినిమా వాళ్లను ఒక్క లెక్కన కరోనా వేపుకుతింటోంది. కాస్తా రిలీఫ్ ఇచ్చింది అని హడావుడిగా అందరూ సమ్మర్ కి డేట్లు ఫిక్స్ చేసుకుని రెడీగా కాచుకుని కూర్చున్నారు.

అయితే నాటౌట్ అంటూ కరోనా సెకండ్ వేవ్ భయంకరమైన భూతంలా మీద పడిపోతోంది. దాంతో వకీల్ సాబ్ ఒక్కడే థియేటర్ల దాకా రాగలిగాడు. మిగిలిన సినిమాలు అన్నీ కూడా వెనక్కి పోయాయి. మే నెలలో మూవీస్ కూడా వరసపెట్టి అలాగే నెట్టుకుంటూ పోతున్నాయి. ఇక అందరి ఆశ కూడా జూన్ నెల మీదనట.

జూన్ నెలలో చాలా సినిమాలు ఆల్ రెడీ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇపుడు ఏప్రిల్ మే నెలలో రిలీజ్ బొమ్మలన్నీ వచ్చి మరీ జూన్ లో దొమ్మీ చేస్తామంటున్నాయిట. ఈ పరిణామంతో జూన్ నెల అంటే దాదాపుగా కొట్టుకునేలా ఉంది అంటున్నారు. ఎవరి సినిమా మీద ఏ సినిమా ఎక్కించేస్తారో తెలియదు. థియేటర్లు కూడా ఎవరికి ఎన్ని దొరుకుతాయో అసలు క్లారిటీ లేదు. సోలోగా బొమ్మ వస్తుందా అంటే ఆ ఠికానా కూడా లేదు. మొత్తానికి జూన్ నెలలో అతి పెద్ద సినీ యుధ్ధమే జరగబోతోంది అంటున్నారు. అది కూడా అప్పటికి కరోనా శాంతిస్తేనే మరి. చూడలి మరి ఏం జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: