ఇంటర్నెట్ డెస్క్: సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క సినిమా వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. వందల మంది చెమటోడ్చి శ్రమిస్తేనే ఓ సినిమా తెరమీదకొచ్చి కోట్ల మందిని అలరిస్తుంది. అయితే అంత కష్టపడి తీసిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే దానికోసం పనిచేసిన వారి కష్టమంతి వృథా అయిపోతుంది. అందుకే సినిమా తీసేముందు సరదు కథలను ఒకటికి రెండు సార్లు దర్శకనిర్మాతలు పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తుంటారు. మరికొన్ని సార్లు కొన్ని కథలను పూర్తిగా రిజెక్ట్ చేస్తుంటారు. అవి సినిమా తీస్తే కచ్చితంగా హిట్ కొట్టలేవనే ఆలోచనతోనే వారలా చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు వారి ఆలోచన పూర్తిగా తలకిందులవుతుంది. ఎంతోమంది రిజెక్ట్ చేసిన కథను ఎవరో సినిమాగా మలిస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డులు తిరగరాస్తాయి. అప్పుడు.. ఆ కథను రిజెక్ట్ చేసిన వారు.. ‘అరె మనం ఎందుకు రిజెక్ట్ చేశామా..?’ అని ఆలోచనలో పడతారు. అలాంటి కథలు సినీ ఇండస్ట్రీలో కోకొల్లులున్నాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కల్ట్ క్లాసిక్ సినిమా.. ఆ నలుగురు. ఈ మాటను ఇప్పటికీ ఎవరూ కాదనలేదు. మ‌ద‌న‌ప‌ల్లి స‌మీపంలోని కొత్త‌కోట‌లో జ‌రిగిన ఓ యదార్థ సంఘటనకు తార్కాణంగా ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ ఓ వ్యక్తి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన.. ద‌ర్శ‌కుడు మ‌ద‌న్‌కు ఎంతో ఆవేద‌న‌, ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వ్య‌క్తి ఊరంతా అప్పులు చేసి మరణించినా.. అతడి అంత్యక్రియ‌ల‌కు అక్కడి ప్ర‌జ‌లంతా క‌దిలి వ‌చ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయ‌న అప్పుల గురించి కాకుండా మంచి గురించి మాట్లాడుకుంటూ అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. ఈ ఘటన మదన్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే స్టోరీ లైన్ తీసుకుని ఆయన ఓ క‌థ త‌యారు చేసుకున్నాడు. డ‌బ్బు క‌న్నా మాన‌వ‌తా విలువ‌లు ప్ర‌ధానం అని చెప్పేలా స్టోరీ రాసుకున్నాడు. దానికి అంతిమ‌యాత్ర అనే పేరు పెట్టాడు.

ఈ స్టోరీతో సీరియల్ తియ్యొచ్చ‌ని ఈటీవీకి పంపించాడు. వారు దాన్ని తిర‌స్క‌రించారు. అదే క‌థ‌ను కాస్త డెవ‌ల‌ప్ చేసి భాగ్య‌రాజా ద‌గ్గ‌ర‌కు తీసుకుపోయాడు. ఆయ‌న తెలుగు, త‌మిళ్‌లో తానే తీస్తానని చెప్పాడు. ఈ సినిమాకు మోహ‌న్ బాబు అయితే బాగుంటుంద‌న్నాడు. ఆ త‌ర్వాత ఈ స్టోరీని ప్ర‌కాష్ రాజుకు చెప్తే క‌థ బాగున్నా సినిమాగా ప‌నికిరాద‌ంటూ నో చెప్పాడు. ఆ తర్వాత స్నేహితుడైన డైరెక్ట‌ర్ చంద్ర సిద్దార్థ్‌కు మదన్ ఈ కథ వినిపించాడు. కథ న‌చ్చి త‌నే ఈ సినిమాను నిర్మిస్తాన‌ని చెప్పి, ఆ త‌ర్వాత రాజేంద్ర ప్ర‌సాద్ కథ వినిపించారు. ఆయ‌న ఎంతో భావోద్వేగానికి గురై కంట త‌డి పెట్టుకున్నారు. ఈ సినిమాల‌లో తాను న‌టిస్తాన‌ని మాటిచ్చాడు.

హీరోయిన్‌గా ఆమ‌ని, సంగీత ద‌ర్శ‌కుడిగా ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఓకే అయ్యారు. సినిమా టైటిల్‌ను అంతిమయాత్ర నుంచి ‘ఆ న‌లుగురు’గా మార్చారు. ఈ సినిమా విడుదలైన తరువాత ప్రేక్ష‌కుల నుంచి ఎంతో ఆద‌ర‌ణ పొందింది. రాజేంద్ర ప్ర‌సాద్ నటన, ఆయన మాటలు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించాయి. వారి మనసులోతుల్లోకి చేరాయి. అందరినీ ఆలోచింపజేశాయి. ఈ చిత్రం ఎన్నో అవార్డుల‌ను ద‌క్కించుకుని ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: