సినీ ప‌రిశ్ర‌మ‌లో వివాదాలు కొత్తేమీకాదు. వీటిలో కొన్ని ఘ‌ట‌న‌లు మిస్ట‌రీ సినిమా స్క్రిప్ట్‌ను త‌ల‌పిస్తాయి. ద‌‌క్షిణాది స్టార్‌‌ డైరెక్టర్‌ శంకర్ టాలీవుడ్‌ హీరో చెర్రీతో రీసెంట్‌గా ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండ‌గానే.. శంకర్‌  గ‌తంలో తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'అన్నియన్ '‌ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. విక్ర‌మ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం తెలుగులో అప‌రిచితుడిగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. చరణ్‌ సినిమా అయిన తర్వాతే ఈ చిత్ర రీమేక్‌ ఉంటుందని కూడా  శంకర్‌ క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు ‘అన్నియన్’ నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్‌ శంకర్‌కు మెయిల్‌ ద్వారా ఓ సందేశం పంపడం ఈ ప్రాజెక్టును వివాదాస్ప‌దంగా మార్చింది. ఆ మెయిల్‌కు ద‌ర్శ‌కుడు శంకర్ కూడా ఏమాత్రం త‌గ్గ‌కుండా తీవ్రంగానే స్పందించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

ఇంత‌కీ నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్ ద‌ర్శ‌కుడు శంకర్‌కు పంపిన మెసేజ్ సారాంశ‌మేమిటంటే.. 'అన్నియన్‌' చిత్రానికి సంబంధించిన కథ హ‌క్కుల‌ను దివంగ‌త సుజాత గారి దగ్గర నుంచి తాను కొనుగోలు చేశానని, అవి త‌న‌ దగ్గర ఉంటే.. త‌న‌ను సంప్రదించకుండా ఆ సినిమా రీమేక్‌ చేయడం ఏమిట‌న్న‌ది ఆస్కార్ ర‌విచంద్ర‌న్ వాద‌న‌. అంతేకాదు.. ఈ సినిమాపై ఇంకా ముందుకు వెళితే తాను చేయ‌బోయే న్యాయ‌పోరాటాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని కూడా ద‌ర్శ‌కుడు శంకర్‌ని నిర్మాత రవిచంద్రన్ ఈ మెసేజ్‌లో హెచ్చరించాడు. ఈ మెసేజ్‌కు శంకర్‌ కూడా అంతే  స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావ‌డం ఈ అంశంలో ట్విస్ట్‌.

అ అంశంపై శంకర్ స్పంద‌న ఏమిటంటే..  ‘అన్నియన్’  సినిమాకు సంబంధించి హక్కులు మీ దగ్గర ఉన్నాయని చెప్పడం విస్మ‌యానికి గురిచేసింది. కథ, స్క్రీన్‌‌ప్లే, దర్శకత్వం శంకర్‌ అని టైటిల్స్‌లో పడుతుంది. ఈ చిత్ర కథ మొత్తం నాదే. మీరు సుజాతగారి దగ్గర రైట్స్‌ తీసుకున్నానని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయంలో సుజాతగారికి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ కేవ‌లం సంభాష‌ణ‌ల ర‌చ‌న‌లో భాగమ‌య్యారు.‌  ఈ సినిమాను  రీమేక్‌ చేసుకునే పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది. మీకు ఎటువంటి హక్కులు లేవు. ఈ సినిమాతోనే మీకు నిర్మాతగా గుర్తింపు వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా హక్కులు నావంటూ.. వివాదం సృష్టించ‌డం దురదృష్టకరం. ఈ వివరణ తర్వాత అయినా.. మీరు మీ బుద్ది మార్చుకుంటారని భావిస్తున్నాను. నిరాధారమైన వార్తలతో కోర్టులు అంటూ బెదిరించడం మానుకోండి. నా కెరీర్‌పై జరుగుతున్న ఇటువంటి అన్యాయమైన ఆరోపణలను ఖండిస్తూ.. మీకు వివరణ ఇస్తున్నాను.." అని శంకర్‌ పేర్కొన‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: