ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా జీవితంలో ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. కష్టాలు, నష్టాలకోర్చి లక్ష్యం కోసం పోరాడాలి. అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కొందరు ఈ కష్టాలను తట్టుకోలేక, మరికొందరు ఈ నష్టాలను ఓర్చుకోలేక మధ్యలోనే తమ ప్రయత్నాలను విరమించుకుని వెనుతిరుగుతుంటారు. కానీ మరికొందరు మాత్రం లక్ష్యాన్ని చేరేవరకు అలుపెరగకుండా పోరాడి అనుకున్నది సాధిస్తారు. ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతారు. అలా ఎదిగిన హీరోనే బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్.. ఆమిర్ ఖాన్.

భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆమిర్ ఖన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వయసు 5 పదులు దాటినా.. అతడికి ఇప్పటికీ అభిమానులు నీరాజనాలు పడుతుంటారు. దీనికి కారణం పనిలో అతడి పర్ఫెక్షన్. అతడి డిటర్మినేషన్. తొలి సినిమాకు సంబంధించిన పోస్టర్లను తీసుకుని వీధివీధికీ తిరుగుతూ అందరికీ పంచిపెట్టి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు ఆమీర్ ఖాన్. తండ్రి, బాబాయ్ ఇద్ద‌రూ సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తులే కావ‌డంతో బాల న‌టుడిగానే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. చిన్న‌ప్పుడే యాదోంకి బారాత్ అనే సినిమాలో న‌టించాడు. ఆ త‌ర్వాత చ‌దువుపై దృష్టి పెట్టాలనుకున్నా.. ఆర్థిక సమ‌స్య‌లు వల్ల ఇంట‌ర్ వరకు చదివాడు.

బాలీవుడ్‌లో ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ అయిన ఆమిర్ తండ్రి తాహిర్ హుస్సేన్.. తీసిన సినిమాల‌న్నీ అప‌జ‌యాలు చవి చూడడంతో అప్పులు పెరిగాయి. ప్రతి రోజూ ఇంటికి వచ్చిపోయే అప్పుల వాళ్లతో నిండిపోయేది. అదే స‌మ‌యంలో ఆమిర్ ఖాన్ స్నేహితుల‌తో క‌లిసి షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా థియేట‌ర్ ఆర్ట్స్ వైపు వెళ్లాడు. డైరెక్ష‌న్ రంగంలో శిక్ష‌ణ తీసుకున్నాడు. డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ అయిన పెద‌నాన్న నజీర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేరాడు. రెండు సినిమాల‌కు అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఈ క్రమంలోనే ఆమిర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందని పెదనాన్న నజీర్ అనుకున్నాడు. అనుకున్న‌ట్లు గానే క‌యామ‌త్ సే క‌యామ‌త్ త‌క్ పేరుతో అమిర్, జూహిచావ్లా హీరో, హీరోయిన్లుగా సినిమా తీశారు.

క‌యామ‌త్ సే క‌యామ‌త్ త‌క్ సినిమా తన కెరీర్‌కు ఎంత గొప్ప మైలురాయో ఆమిర్‌కు తెలుసు. అందుకే సినిమా ప్రచారం కోసం ఆమిర్ స్వ‌యంగా ప్ర‌చారం చేశాడు. సినిమా పోస్ట‌ర్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ జనాలకు పంచిపెట్టాడు. ఆటో వాళ్ల‌ను క‌ల‌సి త‌న మూవీ పోస్ట‌ర్ల‌ను వారి ఆటోల‌పై అంటించి త‌న‌కు స‌హ‌క‌రించాల్సిందిగా కోరాడు. తండ్రి, పెద‌నాన్న ప్రొడ్యూస‌ర్స్ అయినా ఆమిర్ ఏ మాత్రం అలసత్వం వహించలేదు.
కాగా.. 1988లో విడుదలైన క‌యామ‌త్ సే క‌యామ‌త్ త‌క్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్‌తో ఆమిర్ జీవితం మారింది. త‌న కుటుంబ అవ‌స్థ‌లు తీరాయి. ఆ తరువాత బాలీవుడ్‌ మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్‌ హీరో ఎదిగి.. ఇప్పటికీ ఎన్నో మంచి సినిమాలు చేస్తూ సూప‌ర్ స్టార్‌గా నిలుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: