సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిపై దృష్టిపెట్టారు. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌తో సినిమా తీసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ జీవితం.. ఆ త‌ర్వాత జైలుకు వెళ్ల‌డం.. ష‌ర్మిల పాద‌యాత్ర‌.. బెయిల్‌పై బ‌య‌ట‌కు రావ‌డం.. ఓదార్పు యాత్ర‌.. త‌ర్వాత ముఖ్య‌మంత్రి కావ‌డంలాంటి అంశాల‌న్నీ వ‌ర్మ ఈ సినిమాలో స్పృశిస్తున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ జైలు జీవితంపై ఎక్కువ‌గా దృష్టిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. సినిమా క‌థంతా జైలు చుట్టూనే తిప్ప‌బోతున్నారు. ఈ సినిమాకు ఇప్ప‌టికే జ‌గ‌మొండి అనే పేరును కూడా ఖ‌రారు చేశారు.

విల‌న్‌గా సోనియాగాంధీ?
ఇది పూర్తిగా పొలిటికల్ డ్రామాగా ఉంటుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నాయకులు ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని దేశంలోనే నిజమైన హీరో రూపంలో చూపించడమే వీరి ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు. ఆర్జీవీ వారి ల‌క్ష్యానికి చేరుకుంటారా?  లేదా? అనేది సినిమా విడుద‌లైన త‌ర్వాతే తెలుస్తుంది. దేశంలో ఎంతటి వారినైనా తన అదుపులో పెట్టుకుని నడిపించిన సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గురించి అంద‌రికీ తెలిసిందే. ఆ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నసమయంలో జగన్ రాజకీయంగా హీరో అయ్యాడని.. కాబట్టి జగమొండి పేరు స‌రిగా స‌రిపోతుంద‌ని, సోనియాగాంధీని విల‌న్‌గా చూప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సోనియా పాత్ర ఎవ‌రిచేత వేయించాలి? అనేదే వ‌ర్మ‌కు స‌మ‌స్య‌గా మారిందంట‌.

కంగ‌నా అయితే స‌రిపోతుంది
సోనియాగాంధీ రూపంలో నటించే కారెక్టర్ కోసం మొదట ఇటలీ నుంచి తీసుకు వద్దామని అనుకున్నారు. చివరకు `కంగన రనౌత్` అయితే సరిపోతుందని భావిస్తున్నార‌ని స‌మాచారం. కంగనా  బీజేపీలో ఉండ‌టం.. ఆ పార్టీ ఆమెకు బాగా మ‌ద్ద‌తిస్తుండ‌టం.. వల్ల ఆ సినిమాకు మంచి మైలేజీ వస్తుందని నిర్ణయించుకున్నారట. ఇంకా కంగ‌న పేరు ఖ‌రార‌వ‌న‌ప్ప‌టికీ ఆమె డేట్స్ ఇస్తే ఖాయ‌మంటున్నారు. ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు ఈ పాత్ర‌లో కంగ‌నాను న‌టింప‌చేసేందుకు ఎంతైనా రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి కూడా నిర్మాత‌లు కూడా వెన‌కాడ‌టంలేదంట‌. అంతిమంగా జ‌గ‌న్ క‌థానాయ‌కుడిగా హైలైట్ అవ‌డ‌మే వారి ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: