కరోనా మొదటి వేవ్ కాస్త బలహీన పడగానే ఇంకేముంది కరోనాని దాటేశామని అనుకున్నారు అందరూ. కానీ సెకండ్ వేవ్ వచ్చాక విషయం అర్థం అవుతోంది. ముఖ్యంగా సినిమా వాళ్ళు అయితే ఒక నెల రోజుల క్రితం వరకు ఇక కరోనా అనేది మళ్ళీ రాదు అని ఫిక్స్ అయిపోయారు. అందుకే పెద్ద ఎత్తున షూటింగులు చేస్తూ సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటిస్తూ కాస్త పండుగ వాతావరణం సృష్టించారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని కరోనా సెకండ్ వేవ్ అంతటినీ మార్చేసింది. ఇప్పటికే దియేటర్లు మూతపడగా షూటింగులు కూడా ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది వైభవంగా నడిచిన ఓటీటీ మళ్లీ పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 


నిజానికి గత ఏడాది ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ లు సినిమాలను కొని నేరుగా రిలీజ్ చేశాయి. డైరెక్ట్ గా థియేటర్ రిలీజ్ చేస్తే వచ్చినంత లాభాలు రాక పోయినా దర్శక నిర్మాతలు ఇబ్బందులు పడకుండా ఈ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్  లు గట్టెక్కించాయనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీ పుంజుకుని థియేటర్లు మళ్ళీ ఓపెన్ కావడంతో వీటి ప్రభావం తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ ఆగిపోయి థియేటర్లు మూత పడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ అందరూ ఓటీటీ వంక చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి వెళ్లిపోయిన సినిమాలను ఒకటొకటిగా రిలీజ్ చేస్తున్నారు. 


అయితే మరి కొద్ది రోజుల పాటు ఈ కరోనా టెన్షన్ కానుక కొనసాగితే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో థియేటర్లు మూసేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆక్యుపెన్సీ 50 శాతానికి తగ్గించడంతో పాటు అక్కడి టికెట్ రేట్లు దారుణంగా ఉండడంతో థియేటర్లను ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సినిమా థియేటర్లు ఓపెన్ కావడం అనేది కష్టం అనే చెప్పాలి. మరి చూడాలి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: