కోవిడ్ ప్ర‌భావంతో తెలుగు చిత్ర‌సీమ అల్లాడుతోంది. షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లు ఆగిపోయాయి. ఇప్పుడు ఏకంగా థియేట‌ర్లే బంద్ అయ్యాయి. కోవిడ్ కార‌ణంగా తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసేశారు. అంతేకాదు షూటింగులు కూడా జరపకూడదని ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా తీవ్రత వల్ల అగ్ర హీరోలు చిరంజీవి ‘ఆచార్య’, మహేష్‌ ‘సర్కారువారి పాట’, వెంకటేష్‌ - వరుణ్‌ తేజ్‌లు నటించే ‘ఎఫ్‌-3’ సహా పలు చిత్రాల షూటింగులను రద్దు చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా ఒక సందేశాన్ని విడుదల చేసింది. అత్యవసరమైతే తప్పా సినిమా షూటింగ్ జరపవద్దని పేర్కొంది. అవసరమైన అనుమతులు తీసుకోవలసి ఉందని, షూటింగులకు సిబ్బంది పరిమాణం 50 మందికి మించరాదని కూడా పేర్కొంది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇలాంటి సమయంలో కూడా ఓ చిత్రం షూటింగ్ ను యథావిధిగా కొనసాగిస్తోంది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘అణ్ణాత్త’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా డి.ఇమ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది. గతంతో ఈ చిత్రం యూనిట్‌ సభ్యుల్లో కొందరికి కరోనా సోకడం, హీరో రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంతో షూటింగ్‌ వాయిదా వేశారు. అయితే, గత పది రోజుల క్రితం మళ్ళీ చిత్రీకరణ ప్రారంభించారు. ప్రస్తుతం కట్టుదిట్టమైన చర్యలు, ఎన్నో జాగ్రత్త ల మధ్య షూటింగ్‌ జరుగుతోంది. తెలంగాణాలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి తీవ్రరూపందాల్చింది. ఈ కారణంగా అనేక చిత్రాల షూటింగ్‌లు వాయిదావేస్తున్నారు. ఈ ప్రభావం రజనీకాంత్‌ 'అణ్ణాత్త' షూటింగ్‌పై కూడా పడే అవకాశం ఉంది. చిత్ర యూనిట్‌ షూటింగ్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, ఈ చిత్రం విడుదల కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ ‘అణ్ణాత్త’ చీత్రీకరణ రద్దుపై ఆ చిత్ర యూనిట్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: