ఇంటర్నెట్ డెస్క్: సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ భారతీయుడు సీక్వెల్ ప్రకటించి రెండేళ్లు దాటిపోతోంది. కానీ ఇప్పటికీ ఆ సినిమా పూర్తి కాలేదు. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాకు అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. షూటింగ్ దశలో ఉండగానే ప్రమాదాలు జరగడం.. ఓ టెక్నీషియన్ ప్రానాలు కోల్పోవడంతో తొలుత ఆగిన సినిమా ఆ తర్వాత కరోనా దెబ్బకు నిలిచిపోయింది. ఇలా పెద్ద సమస్యలే వచ్చిపడ్డాయి. మధ్యలో కరోనా నుండి బయటపడి మళ్లీ సినిమా ప్రారంభం అవుతుందని అనుకుంటే.. సినిమాను శంకర్ ఆపేశాడంటూ వార్తలు గుప్పుమన్నాయి.

సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోందని, దీనిని వెంటనే తగ్గించాలని నిర్మాతలు అనడంతో సినిమా కొన్నాళ్లు ఆగిపోయింది. దీంతో కొద్దిరోజుల కిందట శంకర్ రాంచరణ్ తో ఓ సినిమా.. అలాగే రణ్‌వీర్ సింగ్‌తో అపరిచితుడు సీక్వెల్ ప్రకటించాడు. ఆ వెంటనే లైకా ప్రొడక్షన్స్ వారు భారతీయుడు మూవీ పూర్తి చేయాలనీ, దానిని అలా వదిలేసి వేరే సినిమాలను శంకర్ ఎలా చేస్తాడంలూ కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై కోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ‘మీరే తేల్చుకోండి’ అని చెప్పి ఊరుకుంది. దీంతో శంకర్‌కు, నిర్మాతలకు మధ్య చర్చలు జరిగాయి. కానీ విఫలం కావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.

ఇదంతా ఓ ఎత్తయితే.. తన సినిమా గురంచి ఇంత రచ్చ జరుగుతున్నా.. సినిమాలో మీరో కమల్ హాసన్ మాత్రం కనీసం నోరు తెరిచి ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు. ఇన్నిరోజులుగా ఈ సినిమా వివాదం నెలకొని ఉన్నా.. కమల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు కమల్ మౌనం వెనకున్న రహస్యం ఏంటనేది ఎవరికీ తెలియని ప్రశ్నగా మారింది. మరి ఇప్పటికైనా కమల్ స్పందిస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే శంకర్ ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. 28ఏళ్లు డైరెక్షన్ కెరీర్లో ఎన్నో వరల్డ్ వైడ్ హిట్లు కొట్టారు. కానీ 10ఏళ్లుగా ఆయన స్థాయిలో హిట్ ఒక్కటీ రాలేదు. 2010లో విడుదలైన రోబో మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత శంకర్ మరో హిట్‌ను అందుకోలేదు. ఆ తర్వాత విజయ్‌తో 'స్నేహితుడు' విక్రమ్‌తో ‘ఐ’ రజినీతో రోబో-2 సినిమాలు తెరకెక్కించినా వాటిలో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. ఈ క్రమంలో భారతీయుడు 2 సినిమా అయినా తనను నిలబెడుతుందని శంకర్ భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాలతో ఆయనలో మనోధైర్యం దెబ్బతిన్నదేమో ఆయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: