టాలీవుడ్ దర్శకదిగ్గాజం ఎస్ ఎస్ రాజమౌళి పేరు ప్రస్తుతం దేశవిదేశాల్లో కూడా మారుమ్రోగుతోంది. బాహుబలి రెండు సినిమాల భారీ సక్సెస్ తో టాలీవుడ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వెలుగెత్తి చాటిన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా, నందమూరి ఫ్యామిలీల స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై మన దేశంతో పాటు విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ ఆడియన్స్ నుండి మంచి స్పందన రాబట్టి సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి.

ఈ సినిమాని పేట్రియాటిక్ డ్రామా మూవీగా పలు యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ శరన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా అనేక సినిమాలు షూటింగ్స్ ఆగిపోవడం, మరికొన్ని రిలీజ్ కు సిద్దమైన సినిమాలు వాయిదా పడడం జరిగింది.

దానితో జూన్, జులై లో రావలసిన పలు సినిమాలు సెప్టెంబర్, అక్టోబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాయని, దానితో ఆర్ఆర్ఆర్ కూడా మరొక మూడు నెలలు వాయిదా పడి 2022 సంక్రాంతికి వెళ్లే ఛాన్స్ ఉందని పలు వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ పలు మార్లు వాయిదా పడడంతో, ఈ పరిస్థితుల్లో సినిమాని మరొక్కసారి వాయిదా వేస్తే అది మూవీ పై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే అనుమానాన్ని కొందరు యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ఇన్నిసార్లు వాయిదాల పర్వం కొనసాగుతుండడంతో ఎలాగైనా ఈ సినిమాని సక్సెస్ చేసే బాధ్యత నీదే జక్కన్నా అంటూ పలువురు మెగా, నందమూరి ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దర్శకుడు రాజమౌళి ని అభ్యర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: