కరోనా దెబ్బకు ఇండియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. రోజురోజుకి లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ మహమ్మారి దెబ్బకు కుదేలైంది. షూటింగులు లేకపోవడం, సినిమా రీలీజ్‌లు లేకపోవడంతో వేల మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కనీసం పూటగడవని పరిస్థితిలో సాయం కోసం ఆర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి తమవంతుగా సాయం చేసేందుకు అన్ని ఇండస్ట్రీల్లోని సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొంతమంది ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేకమంది సెలబ్రిటీలు కూడా కార్మికులకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, ఫర్హాన్ అక్తర్ షారూఖ్ ఖనా్ తదితరులు కరోనా బాధితులకు సాయం అందించారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చేరాడు. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ వెల్లడించారు. సల్మాన్ ఎంతో గొప్ప మనసు చాటుకున్నారని, వారి సాయాన్ని ఎంతో ప్రశంసిస్తున్నామని తివారీ అన్నారు. కాగా.. ఇటీవలే సల్మాన్ ఖాన్ 5వేల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఆహార ప్యాకెట్లను అందజేసిన విషయం తెలిసిందే.

అలాగే సల్మాన్ తోపాటు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ కూడా 35వేల మంది సీనియర్ సిటిజన్ కార్మికులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా నలుగురు సభ్యులు ఉన్న సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్ సరుకులు ఇచ్చేందుకు కూడా యశ్ రాజ్ ఫిల్మ్స్ ముందుకొచ్చిందని తివారీ చెప్పారు. ఇప్పటికే సల్మాన్‌తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు కార్మికుల జాబితాను అందజేశామని, త్వరలోనే వారందించే సాయం త్వరలోనే కార్మికులకు చేరుతుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: