టాలీవుడ్ దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ దిశగా దూసుకుపోతోంది. ఎక్కడా లేని విధంగా వందలకు పైగా సినిమాలు తెలుగులో ఒక్క ఏడాదిలోనే నిర్మాణం అవుతాయి. టాలీవుడ్ బాలీవుడ్ కే గట్టి పోటీ ఇస్తోంది. బాలీవుడ్ బడ్జెట్ ని సైతం మ్యాచ్ చేస్తూ పాన్ ఇండియా మూవీస్ ని కూడా తీస్తోంది.

అటువంటి టాలీవుడ్ కి తట్టుకోలేని ఇబ్బందిగా కరోనా పరిణమించింది. బంగారం లాంటి రెండు సీజన్లను కరోనా మింగేసింది. దీంతో టాలీవుడ్ కి అపార నష్టమే కలుగుతోంది అంటున్నారు. టాలీవుడ్ కి అద్భుతమైన సీజన్లు ప్రతీ ఏటా ఉన్నాయి. అందులో దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగులు ఉంటే వాటికి పది రెట్లు  పెద్ద  సీజన్ గా సమ్మర్ ని చెప్పుకుంటారు.

సమ్మర్ అంటే కచ్చితంగా మూడు నెలలకు పైగా సెలవు రోజులు, సినీ పరిభాషలో చెప్పుకోవాలంటే శత దినోత్సవాలు అన్న మాట. మరి ఈ వంద రోజులలో ఎన్ని సినిమాలు వచ్చినా మెజారిటీ సక్సెస్ అవుతాయి. జనాలు సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడేది ఈ సీజన్ లోనే. దాంతో టాలీవుడ్ కి సమ్మర్ అంటే బంగారం తో సమానం. అటువంటి సమ్మర్లు ఒకటి కాదు రెండు కళ్ళ ముందే గిర్రున వెళ్ళిపోతూంటే టాలీవుడ్ ఏం చేయలేని స్థితిలో ఉంది.

గతసారి కరోనా మొదటి దశ వచ్చి సినీ రంగాన్ని దెబ్బ తీస్తే రెండవ దశ ఏకంగా చావు దెబ్బ తీసిందనే అంటున్నారు. దాంతో వచ్చే ఏడాది సమ్మర్ వరకూ టాలీవుడ్ కి మంచి రోజులు లేవా అన్న మాట అయితే వినిపిస్తోంది. కరోనా రెండవ దశ ఉధృతి తగ్గినా ఈ ఏడాది చివరి నాటికి కానీ పరిస్థితులు చక్క బడవు. సంక్రాంతికి కూడా అన్ని సినిమాలు వచ్చే సీన్ లేదు. కాబట్టి 2022 సమ్మర్ మీదనే ఇపుడు టాలీవుడ్ ఆశగా ఉందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: