కరోనా తొలిదశ విజృంభిస్తున్న వేళ, లాక్ డౌన్ లో దేశ ప్రజలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చి అందరి మన్ననలు అందుకున్నారు పవన్ కల్యాణ్. అవసరం ఉన్నవారికి లేదనకుండా సాయంచేస్తారని కూడా ఆయనకు మంచి పేరుంది. అయితే సెకండ్ వేవ్ లో పవన్ కల్యాణ్ నేరుగా ఎక్కడా సహాయ కార్యక్రమాలకు పూనుకోలేదు. ఓవైపు సినీ నటుడు సోనూసూద్, ఆక్సిజన్ ప్లాంట్ లు స్థాపించేందుకు సైతం ముందుకొస్తుంటే మిగతావారు ఆ స్థాయిలో కృషి చేసిన దాఖలాలు లేవు. పవన్ కల్యాణ్ కూడా సెకండ్ వేవ్ టైమ్ లో ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతున్నారే కానీ, ప్రతిపక్షంగా తాను చేయగలిగిన విషయాలపై దృష్టిపెట్టలేదు. అయితే పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ మాత్రం కరోనా బాధితులకు, వారి బంధువులకు తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇన్ స్టా వేదికగా ఆమె సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుతున్నానని, ఎవరైనా ఎలాంటి  సాయమైనా తనను కోరొచ్చని, అవసరమైన వారు మాత్రమే సాయాన్ని అడగాలని ఆమె ఓ మెసేజ్ పెట్టారు. కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలంతా సినిమా ప్రమోషన్ ని పక్కనపెట్టి సోషల్ మీడియా వేదికగా కొవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడటం సంతోషంగా ఉందని చెప్పారామె. తాను కూడా వారి బాటలోనే ఇన్ స్టా వేదికగా కొవిడ్ బాధితులకు సహాయం చేస్తానన్నారు.

ఆక్సిజన్ లభ్యత, ఆస్పత్రిలో బెడ్ల కొరత, ఇతర అత్యవసర మందులకోసం ఎవరైనా తనను సంప్రదించొచ్చని చెప్పారు. అయితే తాను మాత్రం ఆర్థిక సాయం చేయలేనని, మాట సాయం లేదా, ఎవరైనా దాతల సాయం అభ్యర్థిస్తానని అన్నారు రేణూ దేశాయ్.

వాస్తవానికి దేశవ్యాప్తంగా కరోనా రోగులకు ఆస్పత్రిలో బెడ్ల కొరత ఉంది. కొన్ని చోట్ల బెడ్ల లభ్యత ఉన్నా కూడా ఆ సమాచారం అవసరమైనవారికి చేరేందుకు ఆలస్యం అవుతోంది. అటు వ్యాక్సినేషన్ ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు లాక్ డౌన్ ల వల్ల ఎక్కడికక్కడ సొంత ప్రాంతాలకు వెెళ్లేవారు కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. ఉపాధి కోల్పోయినవారు, కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా వచ్చి, మరింతగా ఆర్థికంగా చితికిపోయినవారు కూడా లెక్కకు మిక్కిలి కనపడతారు. వీరందరికీ సెలబ్రిటీలు తమవంతు సాయం చేస్తూ మానవత్వం చూపిస్తున్నారు. వారిలో ఇప్పుడు రేణూదేశాయ్ కూడా చేరారు. పవన్ కల్యాణ్ నేరుగా సాయం చేయలేకపోతున్నా.. ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మాత్రం ఇలా అందరికోసం అంటూ ముందుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: